పుష్కర నిధులన్నీ తమ్ముళ్ల జేబుల్లోకి...
పుష్కర నిధులన్నీ తమ్ముళ్ల జేబుల్లోకి...
Published Mon, Aug 1 2016 10:57 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
– టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినవారికే నామినేషన్ పనులు
– నాసిరకం నిర్మాణాలు 12 రోజులు కూడా ఉండవు
– ఒక్కరికే రూ.106 కోట్ల పనులు కేటాయించిన ప్రభుత్వం ఇదే..
– వందల ఏళ్లనాటి ఆలయాలు, మసీదులు కూల్చటం దారుణం
– వైఎస్ విగ్రహం తొలగించిన బాబు మూల్యం చెల్లించుకోక తప్పదు
– వైఎస్సార్ సీపీ జిల్లా వ్యహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ధ్వజం
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం పనులు చేస్తోంది యాత్రికుల సౌకర్యం కోసం కాదని, తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నాణ్యతాప్రమాణాలను గాలికివదిలేసి, వందల కోట్లు దోచి పెడుతోందని మండిపడ్డారు. సోమవారం విజయవాడలో ఆయన పర్యటించారు. తొలుత ఆయన పార్టీ కార్యాలయంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. ఆనంతరం దివంగత వైఎస్సార్ విగ్రహం తొలగించిన కంట్రోల్ రూమ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆతర్వాత పద్మావతి పుష్కర ఘాట్ పరిశీలించారు. ఇది ప్రజలకు వచ్చే పండగలా లేదని తెలుగుదేశం పార్టీకి వచ్చిన పండగలా మార్చి దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం చేస్తున్న నాసిరకం నిర్మాణాలు పుష్కరాలు జరిగే 12 రోజులు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. తనకు కావాల్సిన వారందరికి నామినేషన్ పద్ధతిలో కోట్ల పనులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఒకే కంపెనీకి రూ . 106 కోట్లు పనులు కేటాయించిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. వందల ఏళ్ళ నాటి దేవాలయాలు, చర్చిలు, మసీదులు కూల్చటం దారుణం అన్నారు.
కమీషన్ల కోసం కక్కుర్తి...
పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సౌకర్యాల్ని పట్టించుకోకుండా పుష్కర పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుందని విమర్శించారు. తోట్లవల్లూరులో రూ. 10 లక్షల ఖర్చుతో పూర్తి అయ్యే ఘాట్‌ను కాంట్రాక్టర్లు రావడం లేదని ఇంతవరకు మొదలు పెట్టకపోవటం దారుణమం అన్నారు. కంకిపాడు టీడీపీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీకి ఘాట్ నిర్మిస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి ఘాట్ ఏర్పాటు చేయకపోవటం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు.
అడ్డదారిలో అరాచకం ...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అడ్డదారిలో తొలగించిన సీఎం చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అడ్డదారిలో పోలీసు బలగాల్ని మోహరించి విగ్రహం తొలగించటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. వాస్తవానికి విగ్రహం వల్ల ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేదన్నారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నాం అనే కక్షతో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారని విమర్శించారు.
తొలుత పార్టీ నాయకుడు చంద్రశేఖర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధకృష్ణ, పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి , పార్టీ సమన్వయకర్తలు సింహాద్రి రమేష్ బాబు, బొప్పన భవకుమార్, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల , చందన సురేష్, బీ జాన్‌బీ, మాజీ కార్పొరేటర్ అడపా శేషు , పార్టీ అనుబంధ విభాగాల నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement