మద్యం సరఫరా చేయలేదని..
సాక్షి, విజయవాడ :
అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. శుక్రవారం రాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా తాము కోరిన వెంటనే మద్యం సరఫరా చేయలేదన్న ఆగ్రహంతో ఒక బార్‌పై టీడీపీ నాయకులు ఇద్దరు వీరంగం వేశారు. బార్ సిబ్బందిపై దాడి చేశారని సమాచారం. తెలుగు మహిళా విభాగంలో ఒక కీలక నేత భర్త, ట్రావెల్స్ నడిపే వ్యక్తి టీడీపీలో కీలకనేతగా చెలామణి అవుతున్నారు. నగరంలో ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా ఎంపీ కార్యాలయం సమీపంలో తను, తన భార్య ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తు ఉంటాడు. ఆయన తన సన్నిహితుడితో కలిసి శుక్రవారం రాత్రి స్వర్ణ ప్యాలెస్ సమీపంలోని ఓ బార్‌కు వెళ్లారు. మద్యం తాగిన తరువాత, బార్ సమయం ముగిసిందని సిబ్బంది వారిని బయలకు పంపేశారు. కొద్దిదూరం వెళ్లిన తరువాత తిరిగి మద్యం కావాలంటూ బార్‌కు వచ్చారు. అప్పటికే బార్‌ను సిబ్బంది మూసివేయడం చూసి వారితో ఘర్షణకు దిగారు. తాను అధికారపార్టీ నాయకునని కూడా చూడకుండా మందు సరఫరా చేయడానికి నిరాకరిస్తావా? అంటూ బార్ నిర్వాహకులు, సిబ్బందిపై దాడిచేశారని, బార్‌ను ధ్వంసం చేశారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బార్ సిబ్బంది చేసేదేమీ లేక ఒంటి గంట సమయంలో వారికి కావాల్సిన మద్యం ఇచ్చి సాగనంపారని తెలిసింది. బార్ నిర్వాహకుడికి నగరానికి సమీపంలోని నియోజకవర్గం ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో, ఆయన దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లారని తెలిసింది. తమ పార్టీ నాయకుల ఘనకార్యం గురించి విన్న ఆ ఎమ్మెల్యే నివ్వెరపోయి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.