హోదా కోసం అవసరమైతే కేంద్రంతో తెగతెంపులు
Published Thu, Aug 18 2016 12:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు
అమలాపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేకుంటే కేంద్రంతో తెగతెంపులకు కూడా సిద్ధమేనని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు. అమలాపురంలోని జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో జీఎస్‌టీ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఈ బిల్లుకు ఏపీ ఎంపీలమందరం మద్దతు ఇస్తాం... మీరు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ ఇదే సహకారం అందించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరానని తెలిపారు. వచ్చే నెలలో కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు తెరుస్తారని ఎంపీ చెప్పారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై కసరత్తులు జరుగుతున్నాయన్నారు. చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహార నిధులు దాదాపు రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవల దళితులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు బీమా
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలోని 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకంలో బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని లా హాæస్పిన్ హోటల్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలోనే బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా ద్వారా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల నగదు చెల్లిస్తారన్నారు. సాధారణ మరణానికి రూ. 30 వేలు ఇస్తారన్నారు. ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందితే రూ. 3.62 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఆ కార్మికుల పిల్లలకు 9, 10, ఇంటర్, ఐఐటి చదివే వారికి సంవత్సరానికి రూ. 1,200 చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తారన్నారు. చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నవారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వివాహ కానుక, ప్రసూతి సహాయం, తాత్కాలిక ప్రమాద భృతి, వృత్తి నైపుణ్య శిక్షణ, అంత్య క్రియల సహాయం వంటి సదుపాయాలు కూడా లభిస్తాయన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో కూడా 50 రోజులు పని చేసిన కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఈ పథకం కింద కార్మికులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం రూ. 134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు. సర్వీసు ఛార్జీ కింద బీమాదారు కేవలం రూ. 15 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement