
జీవనాడులు వదిలేసిన సర్కార్
రాజంపేట:
రాష్ట్రానికి జీవనాడులు అయిన మూడు అంశాలకు సంబంధించి గత కొంతకాలంగా చంద్రబాబునాయుడు సర్కారు వదిలేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు మొదటి జీవనాడి అన్నారు. జనాభాపరంగా 65శాతానికి వ్యవసాయమే జీవనాడి అని పేర్కొన్నారు. రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వ్యవసాయ సంజీవిని పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వ్యవసాయ సంజీవిని అని అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం కరువు కాటకాలను జయించగలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కృష్ణమ్మ సాక్షిగా ప్రత్యేకహోదా కోసం పాటుపడతాన ని చెబుతున్నారని,పార్లమెంటు సాక్షిగా అన్ని విషయాల్లో బీజేపీకి లొంగిపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థికపరంగా, పారిశ్రామికపరంగా, వ్యవసాయపరంగా, ప్రాజెక్టులపరంగా, నీటి కేటాయింపులు ఇలా వరుస అన్యాయాలు జరుగుతుంటే చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో ఈ అంశాలపై చర్చించటానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. విభజనచట్టంలోని హామీలే అమలు చేయటం లేదని ఒక వంక అంటుంటే, మరోవంక చంద్రబాబునాయుడు విభజనచట్టంలో పెట్టకపోవడం వల్ల ప్రత్యేకహోదా ఇవ్వలేదంటున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లుగా కలిసి కాపురం చేసినా బీజేపీ నేతలు చంద్రబాబు సర్కార్‌కు విదిల్చిందేమీ లేదన్నారు. అయినా బీజేపీతో కొనసాగుతున్నారంటే, ప్రజాప్రయోజనాలు కాకుండా స్వప్రయోజనాలే ఉన్నాయన్నది సుష్పష్టమన్నారు.