ప్రలోభ పర్వం | tdp sponser to mlc voters | Sakshi
Sakshi News home page

ప్రలోభ పర్వం

Published Tue, Feb 21 2017 11:54 PM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

tdp sponser to mlc voters

- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు తాయిలాలు
- బహుమతులు, నగదుతో పాటు విందు ఇస్తున్న అభ్యర్థులు
- బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి
- గతేడాది లాగే హాట్‌బాక్స్‌ల పంపిణీకి సిద్ధమైన బచ్చల పుల్లయ్య
- ‘పెద్దనోట్ల’ అండతో పెద్దల సభకు ఎన్నికయ్యేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు
- నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారంలో తలమునకలు


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
    శాసనమండలి అంటే పెద్దల సభ. మండలి అభ్యర్థులకు  ప్రత్యేక గౌరవం ఉంటుంది. కానీ పెద్దల సభకు వెళ్లేందుకు పెద్దనోట్ల అండ చూసుకుంటున్నారు కొందరు అభ్యర్థులు. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రమూ తీసిపోకుండా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నగదు ఏర్పాటు చేసుకున్న వీరంతా ప్రస్తుతం పంపకాలపై దృష్టి సారించారు. కొందరు డబ్బుతో పాటు బ్యాగ్‌లు, హాట్‌బాక్స్‌లు లాంటి బహుమతులు ఇచ్చేందుకూ సిద్ధమయ్యారు. అలాగే ఆయా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఖరీదైన ‘కాక్‌టైల్‌ డిన్నర్‌’లు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల బరిలో ఉన్న కొందరు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు.

బ్యాగ్‌లు పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి
    పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కర్నూలు జిల్లా వాసి జనార్దన్‌రెడ్డి ఓటర్లకు ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బ్యాగ్‌లపై తన ఫొటోలను ముద్రించి ‘గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి’ అని వేయించారు. దాదాపు 2.50 లక్షల బ్యాగ్‌లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఒక్కో బ్యాగు విలువ రూ.వెయ్యికి పైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది లెక్కించి, వారికి నగదు పంపిణీ బాధ్యతను ఆ ప్రాంత పార్టీ ఇన్‌చార్జ్‌లపై పెట్టినట్లు సమాచారం.

ఓటర్లకు ఇవ్వాల్సిన నగదు, పంపిణీ చేసే వారి ఖర్చులు, ఇతరత్రా  ఖర్చు మొత్తం లెక్కించి వారికి ఇప్పటికే అందజేసినట్లు తెలుస్తోంది. జనార్దనరెడ్డి ఇప్పటి వరకూ జనాలకు పరిచయం లేని వ్యక్తి. టీడీపీ తరఫున బరిలోకి దిగినప్పటికీ పార్టీ నేతల సహకారం పెద్దగా లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న విభేదాలతో సతమతమవుతున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించలేదు.ఈ నేపథ్యంలో  గిఫ్ట్‌లు, నగదు, డిన్నర్లతో పట్టభద్రులను ప్రలోభపెట్టే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బచ్చల పుల్లయ్య కూడా అదే దారిలో..
        ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వాసి బచ్చల పుల్లయ్య బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఈయన మద్దతుదారులు ఉపాధ్యాయులకు హాట్‌బాక్స్‌లను పంపిణీ చేశారు. కొన్నిచోట్ల హాట్‌బాక్స్‌లతో వెళుతున్న ఆటోలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈసారి కూడా వాటిని పంపిణీ చేసేందుకు బచ్చల పుల్లయ్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కావడం, ఐదేళ్లలో ఆర్థికంగా బలపడడంతో ఖర్చుకు వెనకాడడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బరిలో 39 మంది అభ్యర్థులు!
        పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పట్టభద్రుల కోటాలో 37, ఉపాధ్యాయ కోటాలో 14 కలిపి మొత్తం 51 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పట్టభద్రుల కోటాలో 10, ఉపాధ్యాయ కోటాలో 2 తిరస్కరణకు గురయ్యాయి.  ప్రస్తుతానికి 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 23 వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది. ప్రస్తుతానికి పట్టభద్రుల కోటా నుంచి 27 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరుమాత్రం ముగ్గురి మధ్యే సాగనుంది! వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థి గేయానంద్, టీడీపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి మధ్య త్రిముఖపోటీ నెలకొంది.

అధికారం, డబ్బు తనను గెలిపిస్తాయని జనార్దనరెడ్డి భావిస్తుంటే, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లు, వీటికి మించి వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో తాను తప్పక గెలుస్తాననే ధీమాతో గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఉద్యోగులు కూడా గోపాల్‌రెడ్డిని తమ నాయకుడిగానే ఇప్పటికీ భావిస్తుండటం, ఎమ్మెల్సీగా ఎన్నికైతే తమ సమస్యలపై పోరాడుతారనే నమ్మకం ఆయనకు కలిసొచ్చే అంశాలు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గేయానంద్‌ సీపీఎం మద్దతుతో తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజయం సాధించానని, ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందనే ఆశతో ఉన్నారు.

ఉపా«ధ్యాయ బరిలో ఎవరికి వారే..
 ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో ఉన్నా ఐదాగురు అభ్యర్థుల మధ్య పోటీ ‘నువ్వానేనా’ అన్నట్లు సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, రఘురామయ్య, బచ్చల పుల్లయ్య మధ్య పోటీ నెలకొంది. వీరు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగినా, ఆ సంఘం నేతలు చెప్పినట్లు యూనియన్‌లోని ఉపాధ్యాయులందరూ  ఏకతాటిపై నిలుస్తారా? చివరి నిమిషంలో ఎవరి మనోభీష్టం మేరకు వారు ఓటేస్తారా అనే సందేహాలు  అన్ని యూనియన్లను కలవరపరుస్తున్నాయి. గతంలో యూనియన్ల నిర్ణయానికి కట్టుబడి 20శాతం మంది మాత్రమే ఓటేశారని, తక్కిన వారంతా ఎవరికి నచ్చినట్లుగా వారు వేశారని పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఎవరు బలమైన అభ్యర్థి? విజయావకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయనేది అంతుబట్టడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement