బెత్తం విసిరిన టీచర్.. కంటిచూపు కోల్పోయిన విద్యార్థి
గార్లదిన్నె : ఓ విద్యార్థిపైకి టీచర్ బెత్తం విసరడంతో కంటి చూపు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో చోటు చేసుకుంది. స్థానిక పీడబ్ల్యూ కాలనీలో ముస్లిం, మైనార్టీ గురుకుల పాఠశాలలో అనంతపురంలోని రుద్రంపేటకు చెందిన నాగేంద్రనాయక్, లక్షి దంపతుల ఏకైక కుమారుడు పవన్‌కుమార్‌నాయక్ 6వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులంతా గ్రౌండ్‌లో ఆడుకొంటుండగా అహమ్మద్ అనే ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు బెత్తం తీసుకొని విద్యార్థులపైకి విసిరేశారు. దీంతో పవన్‌కుమార్ నాయక్ అనే విద్యార్థి ఎడమ కంటికి తగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పీఈటీ మునేనాయక్ విద్యార్థి బంధువులకు సమాచారం అందించారు.
పాఠశాల సిబ్బంది హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ప్రకాశ్ కంటి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కంటి లోపల గుడ్డు దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యంకోసం వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. కంటిచూపు పోయినట్లు వైద్యులు తెలపడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఉపాధ్యాయుడు బెత్తం విసరడం వాస్తవమేనని, ప్రమాదవశాత్తూ జరిగిందన్నారు.