
ప్రేమవివాహం చేసుకున్న రెండు నెలలకే..
- పెళ్లైన రెండు నెలలకే..ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
- నలుగురిపై వరకట్నం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
అంగవైకల్యం అడుగడుగునా అవాంతరాలు సృష్టించింది. మొక్కవోని దీక్ష ముందుకు నడిపించింది. విధి పరీక్షకు ఎదురొడ్డి నిలిచింది. లక్ష్యం దిశగా సాగించిన అక్షర యజ్ఞంలో విజయం వరించింది. జీవితం నేర్పిన పాఠం.. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దారి చూపింది. ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని మలుపు.. ప్రేమ. రోజూ వెంట నడుస్తుంటే.. ఏడడుగులు వేస్తాడనుకుంది. నిన్ను నిన్నుగా ప్రేమిస్తానంటే.. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా భ్రమపడింది. ఆస్తిపాస్తులు లేవని తెలిసినా.. జీవితాంతం తోడుంటానంటే కలల ‘రాజు’గా భావించింది. పెళ్లికి ముందే వేసిన తప్పటడుగు.. అతని ప్రేమలోని ‘లోపాన్ని’ బయటపెట్టింది. పెద్దలు.. పోలీసులు.. మూడుముళ్లతో ఒక్కటి చేసినా, ఆ ప్రేమ డబ్బును వరించింది. పుట్టింటికి దూరమై.. మెట్టినింటి వేధింపులకు విసిగిపోయి.. కట్టుకున్నోడి అసలు రూపం బయటపడి.. ఈ జీవితం ఇక చాలనుకుంది. లోకం విడిచి వెళ్లిపోయింది.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని కిందిమాలగేరికి చెందిన లలితమ్మ, రంగన్న(లేట్)లకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చివరి అమ్మాయి మీనాక్షి(27). ఈమె పుట్టుకతో వికలాంగురాలు. కష్టపడి తల్లిదండ్రులు చదివించారు. 2012 సంవత్సంలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా మీనాక్షి ఎంపికై బేతంచర్లలోని ఓ పాఠశాలలో విధుల్లోకి చేరింది. అనంతరం మంత్రాలయం మండలం తుంగభద్ర దగ్గర ఉన్న కాచాపురం ఎంపీపీ స్కూల్‌కు బదిలీపై వచ్చింది. అయితే మీనాక్షి పట్టణంలోని శివ సర్కిల్ దగ్గర టీ స్టాల్ నిర్వహిస్తున్న గొల్ల రాజుతో ప్రేమలో పడింది.
పెళ్లి చేసుకుంటానని..
పెళ్లిచేసుకుంటానని రాజు నమ్మించడంతో కొన్ని రోజులు సహజీవనం చేశారు. జీతం తల్లికి ఇవ్వకుండా రాజుకు ఇచ్చేది. తర్వాత పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేస్తుండటంతో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. చివరకు కుల పెద్దలు ఇద్దరికి శ్రీ రామస్వామి దేవాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. స్థానిక ఎస్‌ఎంటీ కాలనీలోని ఇంటి నెంబర్ 1/3026లో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత అప్పులు ఉన్నాయి.. రూ. 5 లక్షలు కావాలని వేధించటం మొదలు పెట్టాడు. రాజు తల్లి సోమమ్మ, అన్న బ్రహ్మ, బావ రాఘవేంద్ర కూడా ఒత్తిడి చేశారు.
వీరందరూ రోజు మానసికంగా హింసించటమే కాక కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. అడిగినమేర డబ్బు ఇవ్వలేదని భర్త రాజు ఇంటికి రాకుండా, ఫోన్ చేస్తే ఊర్లో లేనని చెప్పి తల్లి దగ్గర ఉండేవాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన మీనాక్షి బుధవారం రాత్రి ఇంట్లో చీర తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలుపు వేసి ఉండటంతో అనుమానం వచ్చిన ఇంటి పక్కల వారు గురువారం మిద్దెపై నుంచి తొంగి చూశారు.
మీనాక్షి చీరకు వేలాడుతూ కనిపించటంతో పట్టణ పోలీసులకు సమాచార మందించారు. వెంటనే డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని ఆరాతీశారు. మృతురాలు రాసిన సూసైడ్ నోట్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నాడు. మృతురాలు అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు భర్త గొల్ల రాజుతో పాటు సోమమ్మ, బ్రహ్మ. రాఘవేంద్రలపై వరకట్న వేధింపుల కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసిన ట్లు డీఎస్పీ తెలిపారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టుం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఉపాధ్యాయురాలి మృతిపై పలు అనుమానాలు..
ఉపాధ్యాయురాలు మీనాక్షి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. శారీరకంగా వికలాంగురాలైన మీనాక్షి ఇంటి వెంటిలేటర్‌కు చీరతో ఉరి వేసుకోవడం, సూసైడ్ నోట్ కింద పేరు రాయకపోవడాన్ని చూస్తే మీనాక్షిది ఆత్మహత్యనా? లేక హత్యనా? అనే అనుమానం తలెత్తుతోంది. పోలీసుల విచారణలో ఇది తేలనుంది.