ఉపాధ్యాయుల ఉగాది సంబరాలు
ఉపాధ్యాయుల ఉగాది సంబరాలు
Published Sun, Mar 26 2017 9:46 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
నారాయణపురం (ఉంగుటూరు): సమాజానికి దిశా నిర్ధేశకులుగా నిలిచే ఉపాధ్యాయులు ఉగాది ఉత్సవం పేరిట తెలుగు సాంస్కృతిక పరిరక్షకులుగా నిలవడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం రాత్రి ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీనివాస రైతు సేవా భవనంలో ఉంగుటూరు మండల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో హేవళంబి నామ తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
పంచాంగ శ్రవణం
భీమవరానికి చెందిన ప్రసిద్ధ పంచాంగకర్త పెదగాడి మోహనరవి శంకర్ తెలుగు సంవత్సర రాశి ఫలాలను వివరించారు. నూతన పంచాంగాన్ని రచించి, ఆవిష్కరించి పంచాంగ శ్రవణం చేశారు. నాలుగేళ్ల నుంచి ఉంగుటూరు మండల ఉపాధ్యాయులు తెలుగు భాషా సాంస్కృతిక వైభవాన్ని రేపటి తరానికి అందించేలా చేస్తోన్న
కృషి ఎనలేనిదన్నారు.
తెలుగు వారి తొలి పండుగ
ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జటావల్లభుల సాయిరాం ఉగాది ప్రాధాన్యతను వివరిస్తూ.. తెలుగు వారి తొలి పండుగ ఉగాది సంప్రదాయాల వెనుక ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందన్నారు. అనంతరం తెలుగు పండితురాలు సీహెచ్ దుర్గ, పంచాగకర్త మోహన రవి శంకర్, సాయిరాంలను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. హాజరైన వారందరికీ నూతన పంచాంగాలు అందజేశారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆరగించి ఉపాధ్యాయులు తెలుగు సంప్రదాయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎంఈవో డి. శుభాకరరావు, తాడేపల్లిగూడెం ఎంఈవో వి.హనుమ, ప్రధానోపాధ్యాయులు సీహెచ్ వెంకట రత్నం, జి.చంద్రారావు, అప్పసాని శేషగిరిరావు, ఉపాధ్యాయ ఉగాది ఉత్సవ కమిటీ సభ్యులు ఉప్పిలి వేంకటేశ్వరరావు, సీతాల సత్యనారాయణ, బాలేశ్వరరావు, పరిమి సత్తిరాజు, కె.ఫణీంద్రనా««థ్, పుప్పాల నరసింహారావు, కె. హరికృష్ణ, జి.ఆనందరావు, కె.శ్రీరామకృష్ణ, పిరిడి ప్రసాద్, మూకల ప్రసాద్‌లతో పాటు మండలంలోని ఉపాధ్యాయులంతా తమ కుటుంబ సభ్యులతో ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement