సాక్షి, నిజామాబాద్ కల్చరల్: ఎన్నికల వేళ పల్లెలు, పట్టణాల్లో జానపదాలు హోరెత్తుతున్నాయి. కళాకారుల ఆటపాటలు మార్మోగుతున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... అంటూ కళాకారులు ఎన్నికల ప్రచారంతో దుమ్ము రేపుతున్నారు. ఆగట్టునుంటావ నాగన్న.. ఈ గట్టుకొస్తావా.. అంటూ ఓటర్లలో చైతన్యం కలిగించే పాటలు పాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కాళాకారులు కీలకంగా మారారు. నియోజక వర్గాల్లో 20 వరకు కళాబృందాలు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున కాలికి గజ్జె కట్టి ఆడుతూ పాడుతున్నారు. నిజామాబాద్ అర్బన్‌తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్,డిచ్‌పల్లి, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కళాకారులను రంగంలోకి దించారు. తమ తరఫున విసృత ప్రచారం చేసేలా వారికి వాహనాలను సమకూర్చి పల్లెల్లోకి పంపించారు. దీంతో కళాకారులు గ్రామాలకు వెళ్తూ తమ ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకొంటూనే, తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షోలతో పాటు బస్తీలు, కాలనీ కూడళ్లలో కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కళాకారులకు డిమాండ్
ఎన్నికల వేళ కళాకారులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 5 నుంచి 10 మంది ఉండే బృందాలకు రోజు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే 15 రోజుల ముందు నుంచి వచ్చే నెల 5 వరకు ప్రచారం చేసేలా భారీ మొత్తంలో కళాకారులతో ఒప్పందాలు చేసుకుని, ప్రచారం చేయిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి సుమారు 50 మంది కళాకారులు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మస్తు గిరాకీ..
ఎన్నికల పుణ్యమా అని అన్ని వర్గాల కళాకారులకు చేతినిండా పని లభిస్తోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో డప్పు కళాకారులతో పాటు అడ్డాకూలీలకు, వంట మనుషులు, టెంట్ హౌస్ సామగ్రి, పూలు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, అద్దె వాహనాలు, ఫొటోగ్రాఫర్‌లు... ఇలా అందరూ ఉపాధి పొందుతున్నారు. ఇంతకుముందు శుభ, అశుభ కార్యక్రమాల సమయంలోనే డప్పు కళాకారులకు పని ఉండేది. కానీ, ఎన్నికల ప్రచారంలో వీరి అవసరం ఎక్కువగా ఉండటంతో కళాకారులతో పాటు పొరుగు జిల్లాల కళాకారులకు డిసెంబర్ 5వ తేదీ వరకు చేతినిండా పని దొరికింది. నేతలొస్తున్నారంటే పూలదండలతో స్వాగతం పలకాల్సిందే. దీంతో పూలదండలు తయారుచేసే వారి వ్యాపారం జోరందుకుంది. ఇక, అద్దె వాహనాలన్నీ ఆయా పార్టీల అభ్యర్థుల వద్దే ఉంటున్నాయి. కొందరు ముందస్తు గానే వాటిని బుక్ చేసుకున్నారు.
డిమాండ్ తీవ్రంగా ఉండడంతో కొంత మంది అభ్యర్థులకు వాహనాలు పంపించడం కుదరడం లేదని ట్రావెల్ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వహిస్తున్న అధికారులకు సైతం వాహనాలు అవసరం ఉండటంతో అద్దె వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కార్యకర్తలు, ముఖ్య నేతల భోజనాలకు కొందరు సొంతంగా వంటలు తయారు చేస్తుండటంతో వంటసామగ్రితో పాటు వంటమనుషులకు పని దొరుకుతోంది. అలాగే సభలు, సమావేశాల సందర్భంగా టెంట్‌హౌస్‌లకు గిరాకీ పెరిగింది. ఫొటోగ్రాఫర్‌లకు, విడియోగ్రాఫర్‌లకు ఇన్నాళ్లు గిరాకీ కోసం ఎదురుచూడాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వారు కూడా బిజీగా మారారు. ఇవే కాకుండా ఫ్లెక్సీ, కరపత్రాల తయారీ కోసం గ్రాఫిక్ డిజైనర్లు, డీటీపీ ఆపరేటర్లు, ప్రింటర్లకు ఎన్నికల వేళ ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment