కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ టీచర్ల ర్యాలీ
కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ టీచర్ల ర్యాలీ
Published Tue, Sep 5 2017 10:32 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసే విధంగా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మూడేళ్లుగా ప్రవర్తిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల జేఎసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయడంపై ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల్లో బయోమెట్రిక్ యంత్రం పనిచేయని పక్షంలో సమీప ప్రాంతంలోని ఇతర కార్యాలయాల్లో హాజరు నమోదుచేయాలని ఆదేశించడం గర్హనీయమన్నారు. ఈ ఆదేశాలను అమలు చేసే క్రమంలో పెరవలిలో ఉపాధ్యాయురాలు బి.రత్నకుమారి ప్రమాదానికి గురై మృతిచెందిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కలెక్టర్ అదే విధానాలను అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు పెంచాలని, ఎస్‌ఎంసీ, పీటీఏ సమావేశాలను, టాయిలెట్ నిర్వహణ వాటి ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, ప్రతి మూడు నెలలకోసారి పాఠశాలలను మూసివేసి మండలస్థాయిలో టీఎల్‌ఎం మేళాలను ప్రదర్శించాలని ఆదేశించడం కలెక్టర్ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న విద్యాశాఖ సమీక్ష సమావేశాల్లో ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాలను, విద్యాశాఖాధికారులను అవమానించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో మానసిక భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి ఏలూరు మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్, డీఈఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ జేఏసీ నాయకులు పి.జయకర్, పీఎన్‌వీ ప్రసాదరావు, బీఎ సాల్మన్‌రాజు, పువ్వుల ఆంజనేయులు, గుగ్గులోతు కృష్ణ, గెడ్డం సుధీర్, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement