ఉపాధ్యాయులు దిశనిర్దేశకులు
సప్తగిరికాలనీ: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం చింతకుంటలోని సంప్రదాయ గార్డెన్‌లో ట్రస్మా జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అభినందన సభ, గురుపూజోత్సవం–2016 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, అతిథులుగా మేయర్ రవీందర్‌సింగ్, నగర కమిషనర్ కృష్ణభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి, ట్రస్మా వ్యవస్థాపకుడు కందాల పాపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎన్ రెడ్డి, కడారి అనంతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ విద్యాసంస్థలే ఊపిరిగా నిలిచాయని గుర్తుచేశారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ట్రస్మా కూడా కారణమన్నారు. ట్రస్మా రాష్ట్ర నాయకులు కందాల పాపిరెడ్డి, ఎస్‌ఎన్ రెడ్డి, కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకూ ప్రభుత్వ పథకాలు వర్తింజేయాలని కోరారు. అనంతరం అతిథులందరూ జిల్లా న లుమూలల నుంచి వచ్చిన సుమారు 300 మంది కరస్పాండెంట్లు, 300 మంది ఉపాధ్యాయులను శాలువా, మెమోంటో, ప్రశంసపత్రాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఉప విద్యాధికారి ఆనందం, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ట్రస్మా రాష్ట్ర జిల్లా శాఖ బాధ్యులు, పలు పాఠశాలల కరస్పాండెంట్లు లింగారెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వి.నరేందర్‌రెడ్డి, ఓదెలు, లింగయ్య, ప్రకాశ్, సర్వోత్తమరెడ్డి, దాసరి శ్రీపాల్‌రెడ్డి, సునీతరెడ్డి, శారదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానేరు పాఠశాల విద్యార్థులు చేసిన బతుకమ్మ నృత్యాలు ఆహుతులను అలరించాయి.