మాయ‘రోగం’! | teachers transfer goalmal | Sakshi
Sakshi News home page

మాయ‘రోగం’!

Published Sun, Jul 16 2017 10:39 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మాయ‘రోగం’! - Sakshi

మాయ‘రోగం’!

– బదిలీ కోసం అయ్యవార్ల అడ్డదారులు
- లేని రోగానికి ధ్రువపత్రాలు
- మిస్సెస్‌లు కూడా ‘మిస్‌’గా దరఖాస్తు
– ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తే వెలుగులోకి అక్రమాలు
– బోగస్‌ పత్రాలపై మెడికల్‌ బోర్డుకు సిఫార్సు చేస్తామన్న డీఈఓ


అయ్యవార్లకు మాయ‘రోగం’ పట్టుకుంది. అన్నీ సవ్యంగా ఉండీ...ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తమకు దీర్ఘకాలిక రోగం ఉందంటూ ధ్రువీకరణ పత్రాలు తెస్తున్నారు. మరికొందరు వికలత్వ శాతం భారీగా పెంచి సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు. బదిలీల వేళ కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అడ్డదార్లన్నీ తొక్కుతున్నారు. ధ్రువీకరణ పత్రం నకిలీదని తెలిసినా అమ్యామ్యాలతో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈఓలు వాటిని ధ్రువీకరిస్తూ దీపం ఉండగానే ఇళ్లు సర్దుకుంటున్నారు.
- అనంతపురం ఎడ్యుకేషన్‌

ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రిపరెన్షియల్‌ కేటగిరీ (వివిధ రోగాలతో బాధపడుతున్న వారు, దివ్యాంగులు) వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వీరికి పాయింట్లతో సంబంధం లేకుండా ముందుగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉన్న ఖాళీల్లో అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.  దీన్ని ఆసరాగా చేసుకున్న అయ్యవార్లు మంచి స్థానాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.  లేనిరోగం ఉన్నట్లు...కాస్తాకూస్తో ఉన్న  అంగవైక్యల్యం శాతాన్ని 70కి పైగా ఉన్నట్లు బోగస్‌ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు ఇలా ప్రణాళిక రూపొందించారు.

అనుకూలమైన స్కూళ్లకు వెళ్లాలని...
ఒకసారి బదిలీ జరిగితే టీచర్లు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లపాటు అదే స్థానంలో ఉండొచ్చు. ఇన్నేళ్లు పని చేయాలంటే అన్ని అనుకూలంగా ఉన్న స్కూళ్లకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆశే కొందరిని తప్పుదారి పట్టిస్తోంది. మంచి స్థానాలు దక్కించుకునేందుకు  అక్రమాలకు తెరతీశారు. కొందరు మెడికల్‌ బోర్డు ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు పొంది తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామని, మరి కొందరు టీచర్లు తక్కువ శాతం అంగవైకల్యం ఉన్నా... 70 శాతానికి పైగా ఉన్నట్లు ధ్రువపత్రాలు పొందారు.

లీలలెన్నో...
బుక్కరాయసముద్రం మండలంలో ఓ ఉపాధ్యాయురాలు ఎలాంటి రోగం లేకపోయినా కేన్సర్‌ ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. అలాగే మరికొందరు తల్లిదండ్రులకు బాగలేదంటూ సర్టిఫికెట్లు పెట్టి ప్రిపరెన్షియల్‌ కేటగిరీకి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే జువైనల్‌ డయాబెటీస్‌లోనూ ఇదే పరిస్థితి. పిల్లలకు షుగర్‌ వ్యాధి లేకపోయినా ఉన్నట్లు ఇంకొందరు తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. పిల్లలు థలసేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా కొందరు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇక కొందరు మహిళా టీచర్లయితే ఏకంగా పెళ్లయినా పెళ్లికాలేదని దరఖాస్తు చేసినట్లు సమాచారం.

చేతులు మారుతున్న డబ్బులు
ఇదే అదనుగా కొందరు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ‘లెక్క’లు సరి చేసుకుంటున్నారు. ఎవరైనా దొంగ సర్టిఫికెట్లతో పాయింట్లు, ప్రిపరెన్షియల్‌ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నారో వారి నుంచి బాగా ఆశిస్తున్నారు. ఓ ఎంఈఓ అయితే తన వాటా ఇస్తేనే దరఖాస్తు పంపుతానని, లేకుంటే పంపేది లేదని ఓ మహిళా టీచరు భర్తకు తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు టీచరు భర్త బేరం ఆడి చివరకు ఎంఈఓకు కొంత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని కొందరు అధికారులు బాగా ఒంటæ పట్టించుకున్నారు.

ప్రత్యేక కమిటీతో విచారణ చేయించాలి
నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులు మంచి స్థానాలు దక్కించుకుంటుంటే... నిజాయతీగా దరఖాస్తు చేసుకున్న టీచర్లకు అన్యాయం జరుగుతోందని పలువురు టీచర్లు వాపోతున్నారు. ప్రిపరెన్షియల్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న టీచర్ల సర్టిఫికెట్లపై ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని చెబుతున్నారు. ఇక్కడ  పని చేసి ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా పని చేస్తున్న కోన శశిధర్‌ ఆ జిల్లాలో ప్రత్యేక బృందాన్ని నియమించి వెరిఫికేషన్‌ చేయిస్తున్నారనీ, అదే తరహాలో మన జిల్లాలోనే తనిఖీలు చేయిస్తే  దొంగ సర్టిఫికెట్ల బండారం బయట పడుతుందంటున్నారు.  
 
క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం
ప్రిపరెన్షియల్‌ కేటగిరీకి అర్హులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా  లేని రోగాలు ఉన్నట్లు చూపినా...అంగవైకల్యం శాతం ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి సర్టిఫికెట్లన్నింటినీ మెడికల్‌ బోర్డుకు పంపి విచారణ చేయిస్తాం. బోగస్‌ అని తేలితే ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అలాగే వాటిని ధ్రువీకరించిన హెచ్‌ఎంలు, ఎంఈఓలపైనే కఠిన చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీనారాయణ, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement