ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం
ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం
Published Fri, Apr 21 2017 9:37 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
-సంఘాలతో చర్చించని సర్కారు
-నిబంధనలపై టీచర్ల అభ్యంతరం
-రేషనలైజేషన్‌పై విద్యాశాఖ కసరత్తు
రాయవరం : రేపటితో విద్యా సంవత్సరం ముగియనుంది. ఉపాధ్యాయుల దృష్టంతా బదిలీలపైనే ఉంది. ఉపాధ్యాయ బదిలీలు వేసవి సెలవుల్లో చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. బదిలీల విషయమై విద్యాశాఖ తయారు చేసిన ముసాయిదాలో పేర్కొన్న నిబంధలనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మేనేజ్‌మెంట్ కింద దాదాపుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా బదిలీలపై ఆశలు పెట్టుకున్నారు.
నిబంధనలపై వీడని పీటముడి..
ఉపాధ్యాయ బదిలీల్లో ఇప్పుడు పాయింట్ల విధానం పైనే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. పాయింట్లు కేటాయించే విధానం, వెబ్ కౌన్సెలింగ్, బదిలీలకు సర్వీసు నిబంధనపైనే ప్రధానంగా టీచర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెర్ఫార్మెన్స్ పాయింట్లపై టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని, ఎనిమిదేళ్ల సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కీలకం కానున్న రేషనలైజేషన్..
విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి నెలాఖరు వరకు రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే బదిలీలకు కీలకం కానుంది. 10 మంది లోపు పిల్లలున్న పాఠశాల ఉంటే ..ఒక కిలోమీటరు పరిధిలో పాఠశాల కూడా ఉండి ఉంటే దానిని పిల్లలు ఉన్న పాఠశాలలో విలీనం చేయాల్సి ఉంటుంది. కిలోమీటరు పరిధిలో ఏ పాఠశాలా లేకుంటే అక్కడే పాఠశాలను కొనసాగించాలి. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులుంటే ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాల(6, 7 తరగతులు)లో 40 మంది లోపు విద్యార్థులుంటే సమీప పాఠశాలల్లో విలీనం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 60–70 మంది విద్యార్థులుంటే ఆ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. మూడు కిలోమీటర్ల పరిధిలో ఒకటికి మించి ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని సమీపంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్కూల్‌లో కలపాలని యోచిస్తోంది. అయితే ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో రేషనలైజేషన్ నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అభ్యంతరాలపై చర్చించాలి
బదిలీ నిబంధనలపై ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదు. ఈ నెల 19న పలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిబంధనలపై సంఘాలు, ఎమ్మెల్సీలతో చర్చించి బదిలీల షెడ్యూల్‌ను కచ్చితంగా విడుదల చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్, అసంబద్ధ నిబంధలనపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణకు ఉపాధ్యాయ సంఘాలు సమావేశం కానున్నట్టు సమాచారం. సంఘాలు లేవనెత్తే పలు అంశాలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు ఉపాధ్యాయ సంఘాలు సన్నద్ధం కానున్నాయి.
వెబ్ కౌన్సెలింగ్‌కు పూర్తిగా వ్యతిరేకం..
ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెబ్ కౌన్సెలింగ్ ఉంటే బదిలీలను వ్యతిరేకిస్తాం.
–డి.వి.రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
పెర్ఫార్మెన్స్ పాయింట్లు తొలగించాలి..
బదిలీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. బదిలీల పేరుతో పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఇస్తామనడం ప్రభుత్వ నిరంకుశత్వ దోరణికి నిదర్శనం. పెర్ఫార్మెన్స్ పాయింట్లు లేకుండా బదిలీలు చేపట్టాలి.
– కవిశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ (
ఆందోళనకు గురవుతున్నారు..
బదిలీల షెడ్యూల్ విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. వేసవి సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. బదిలీల్లో అసంబద్ధ నిబంధనలను సంఘాలన్నీ ఏకమై వ్యతిరేకిస్తాం.
– చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ
Advertisement