trasfer
-
నిజాయితీ అధికారికి బదిలీ బహుమానమా?
సాక్షి, వికారాబాద్: అధికారులు అవకాశవాదులుగా మారి.. ప్రజాప్రతినిధులు, బడా వ్యక్తుల అడుగులకు మడుగులొత్తుతున్న సమయంలో నిజాయితీగా ఉండటం సవాలే.. నిజాయితీగా వ్యవహరిస్తే అవార్డులు, రివార్డులు ఏమో గానీ బదిలీ.. లేక సస్పెన్షన్ వేటో తప్పదన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం డీఎఫ్ఓ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. అయిన వచ్చీ రాగానే అక్రమార్కులకు సింహస్వప్నమయ్యారు. వారి గుండెల్లే రైళ్లు పరిగెత్తేలా చేశారు. కానీ వచ్చిన అనతికాలంలోనే అనేక మార్పులకు నాంది పలికిన ఆయన అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారారు. ఎవరు చెప్పినా... హెచ్చరించిన లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అలాంటి జిల్లా ఫారెస్టు అధికారి జిల్లా డీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్‌రెడ్డి ఐదు నెలల్లోనే బదిలీ కాకా తప్పలేదు. సంస్కరణలకు శ్రీకారం డీఎఫ్ఓ వెంకటేశ్వర్‌రెడ్డి అనేక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా ఆక్రమణలకు నోచుకున్న వాటిని బయటకు తీసి రుజువులతో సహా కోర్టు ముందుంచారు. వికారాబాద్, తాండూరు సమీపంలో కాంట్రాక్టర్లు ఫారెస్టు భూముల్లో తవ్వకాలు జరిపి రూ. వందల కోట్ల విలువగల ఖనిజ సంపద తరలిస్తున్నారని గుర్తించి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఫారెస్టు భూములు కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయించారు. వారు కోర్టులకు వెళ్తే కౌంటర్ ఫైల్ వేశారు. అనుమితి లేని సా మిల్లులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలప రవాణాను అడ్డుకోవటం, అక్రమ కలప కొనుగోలు దారులకు రూ.లక్షల్లో ఫైన్లు వేయటం, అనుమతిలేకుండా ఫారెస్టు భూముల్లోంచి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఫైన్లు వేయటం లాంటి అనేక విషయాల్లో ఆయన ఉక్కుపాదం మోపారు. ఇక వారి ఆటలు సాగవని భావించి కొందరు ప్రజా ప్రతినిధులపై వత్తిడి తెస్తూ వచ్చారు. ఎట్టకేలకు నిజాయితీగా వ్యవహరించిన అధికారిని సాగనంపారు. -
‘జూనియర్, డిగ్రీ’ బదిలీలకు షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూలును ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. జూనియర్ లెక్చరర్లు ఆదివారం లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 13కల్లా ప్రింట్ కాపీ, సర్టిఫికెట్లను జిల్లా ఇంటర్ విద్యాధికారికి అందజేయాలని సూచించింది. ఖాళీలను 13న ప్రకటిస్తామని తెలిపింది. వాటిపై 14న అభ్యంతరాలను స్వీకరిస్తామని, సవరించిన జాబితాలను 15న ప్రకటిస్తామని చెప్పింది. బదిలీలకు అర్హులైన వారి జాబితాను 17న ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తామని, 21న బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను ప్రకటిస్తామని వివరించింది. ఉద్యోగులు ఈనెల 22 నుంచి 24వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 26న బదిలీ ఆర్డర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే డిగ్రీ కాలేజీల్లో ఈనెల 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఖాళీలను 9న ప్రకటించి 10, 11 తేదీల్లో వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. 12న ఫైనల్ ఖాళీల జాబితాను ప్రకటించి, 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను 18న ప్రకటించి, 20న బదిలీ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. -
గురువుల్లో గందరగోళం
- రోజురోజుకూ మారుతున్న బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్ - పాయింట్ల కేటాయింపులో అస్పష్టత - లోపభూయిష్ట విధానాలపై ఉపాధ్యాయుల అసంతృప్తి - ఇంకా పూర్తికాని రేషనలైజేషన్ ప్రక్రియ రాయవరం (మండపేట) / రామచంద్రపురం రూరల్ : ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్.. మరోవైపు ఉపాధ్యాయుల సర్దుబాటు.. వీటికితోడు ఇప్పుడు బదిలీల ప్రక్రియ.. పాఠశాలలు పునఃప్రారంభమైన అనంతరం ఇచ్చిన ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ రోజురోజుకూ మారుతోంది. ఈ షెడ్యూల్, ప్రక్రియ అంతా గందరగోళంగా ఉండడంతో అయ్యవార్లు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడికి, 23న సచివాలయం దిగ్బంధానికి ఉపాధ్యాయ ఉమ్మడి సంఘాల కార్యాచరణ వేదిక జాక్టో ఇప్పటికే పిలుపునిచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఏం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొందని ఉపాధ్యాయ నేతలు అంటున్నారు. దీనికి బదులు సాధారణ కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించాలని, దీనివల్ల ఉన్న ఖాళీల్లో తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉపాధ్యాయులకుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సలహాలు, సంప్రదింపులతో ఉపాధ్యాయుల మధ్య కొంతమేర సర్దుబాటు చేసుకునే వెసులుబాబు కూడా ఉంటుందని సూచిస్తున్నారు. సరికొత్త సమస్యలు - బదిలీల కోసం ఉపాధ్యాయులు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఇందులో బదిలీల ఆప్షన్లు ప్రత్యక్షమవుతున్నప్పటికీ సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. - ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు, ఆన్లైన్ దరఖాస్తు సమయంలో కనిపించే వివరాలకు పొంతన ఉండడంలేదు. దీంతో పలువురు ఉపాధ్యాయులు మార్కులు కోల్పోతున్నారు. - కొందరు అదనపు పాయింట్ల కోసం తప్పుడు సమాచారం నమోదు చేస్తున్నారు. దీంతో ప్రతిభ ఆధారంగా పొందాల్సిన అదనపు పాయింట్లు కోల్పోతున్నామని అర్హులు ఆవేదన చెందుతున్నారు. - నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తయిన హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఎస్జీటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 15,424 మంది ఉపాధ్యాయులున్నారు. బదిలీలు తప్పనిసరి అయినవారు అన్ని కేటగిరీలూ కలిపి జెడ్పీ యాజమాన్యంలో 4,491 మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 150 మంది వరకు ఉన్నారు. బదిలీ అర్హత కలిగిన వారు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వెబ్‌సైట్‌లోని ఆప్షన్ల వల్ల వీరంతా ఆందోళన చెందుతున్నారు. పాయింట్ల కేటాయింపులోనూ.. - పాయింట్ల కేటాయింపులో అసమగ్రత చోటు చేసుకోవడం ఉపాధ్యాయులను కలవరానికి గురి చేస్తోంది. - ప్రాథమికోన్నత పాఠశాలల్లోని భాషా పండితులకు ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయించలేదు. ఏ స్థాయిలో పాయింట్ల కోసం నమోదు చేసుకోవాలన్నది వివరించలేదు. - ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్జీటీలకు స్కూల్ గ్రేడ్ పాయింట్, క్లాస్ గ్రేడ్ పాయింట్ కన్పిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలకు క్లాస్ గ్రేడ్ పాయింట్లు మాత్రమే పొందుపరిచారు. - ప్రాథమిక పాఠశాలల్లో ఒకే స్థాయి ఉపాధ్యాయుల్లో ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయుడికి మాత్రమే పాయింట్లు ఇస్తున్నట్లు వెబ్ దరఖాస్తులో ఉంది. - ఎనిమిది సంవత్సరాల్లో స్పౌజ్ పాయింట్‌ను ఉపయోగించుకుంటే ఐదు పాయింట్లు ఇస్తారు. ఎనిమిదేళ్లు పూర్తయినవారు బదిలీకి అర్హులని నిబంధన పెట్టడంతో.. అంతకంటే తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు గతంలో స్పౌజ్ వాడుకుంటే ప్రస్తుత బదిలీల్లో అదనపు పాయింట్లు ఉండవు. - మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు ఉపాధ్యాయులందరూ నిర్వహిస్తున్నప్పటికీ హెచ్ఎంకు మాత్రమే ఒక పాయింటు కేటాయిస్తున్నారు. - ఒక పాఠశాలలో ఐదో తరగతి చదివిన విద్యార్థులందరూ వేరొక పాఠశాలలో ఆరో తరగతిలో చేరితేనే ఉపాధ్యాయులకు 5 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరు మానేసినా ఉపాధ్యాయులకు ఒక్క పాయింటు కూడా కేటాయించడం లేదు. వాస్తవానికి విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టిన తరువాత వేరొక పాఠశాలలో చేరడం అనేది తల్లిదండ్రుల బాధ్యతే తప్ప ఉపాధ్యాయులకు సంబంధం లేని విషయం. - ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందినవారికి పాయింట్లు కేటాయించడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వమే గుర్తించి ఇవ్వాలి తప్ప, తాను ఉత్తమ ఉపాధ్యాయుడినని, తనకు అవార్డు ఇవ్వాలని దరఖాస్తు చేసుకునే పద్ధతి నచ్చక.. అర్హతలున్నా అవార్డులకు దరఖాస్తు చేయని ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. ఈ నిబంధనల వల్ల బదిలీల్లో వారికి అన్యాయం జరుగుతుంది. - తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో నలుగురు విద్యార్థులు చేరితే, ఉన్న విద్యార్థులతో పోల్చి శాతం లెక్కించి, అధిక పాయింట్లు ఇస్తున్నారు. అదే ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలో అదే నలుగుగురు విద్యార్థులు చేరితే శాతం లెక్కిస్తే తక్కువ వస్తుంది. అయినప్పటికీ దీని ప్రకారం వారికి తక్కువ పాయింట్లు కేటాయిస్తున్నారు. ఒక్కోసారి ఒక్క పాయింటు కూడా రాని పరిస్థితి. - ఇంకా విచిత్రం ఏమిటంటే అన్ని రకాలుగా ఒకే అర్హతలున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పాయింట్లు కేటాయించడంతో ఉపాధ్యాయుల్లో మరింత ఆందోళన నెలకొంటోంది. రేషనలైజేషన్‌పై కానరాని స్పష్టత ఇదిలా ఉండగా పాఠశాలల రేషనలైజేషన్‌పై చిక్కుముడి ఇంకా వీడలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించే ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ జీఓ నంబరు 29 విడుదల చేసింది. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ ప్రారంభించి సుమారు 15 రోజులవుతున్నా నేటికీ స్పష్టత కానరావడం లేదు. రేషనలైజేషన్‌తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉంది. రేషనలైజేషన్‌పై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ దరఖాస్తుల గడువును పెంచుకుంటూ పోతుంది. రేషనలైజేషన్‌లో ఎక్కడెక్కడ ఏయే స్కూల్స్ విలీనమవుతాయి? ఏయే స్కూళ్లు మూత పడనున్నాయనే విషయం స్పష్టమైతేనే బదిలీల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. నత్తనడకన నమోదు పాయింట్ల కేటాయింపుపై అయోమయం చోటు చేసుకోవడంతో జిల్లాలో బదిలీ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 12 నుంచి బదిలీ దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు గడువు పెంచారు. ఈ నెల 15, 16 తేదీల్లో అధిక సంఖ్యలో నమోదు జరిగింది. ఈ నెల 16వ తేదీ వరకూ 3,715 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో పారదర్శకత లేదు ఉపాధ్యాయ బదిలీలల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ప్రకటించింది. కానీ ఈ విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. పారదర్శకత అన్న దానికి ఎక్కడా అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ విధానంలో ఏం జరుగుతుందనే దానికి జవాబుదారీతనం కూడా లేదు. ఏం జరుగుతుందని అడిగితే హెల్్ప లైన్ నంబరు అంటున్నారు. అక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. వేసవి సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలను విద్యా సంవత్సరం ఆరంభంలో చేపట్టడం, విధి విధానాలు సరిగ్గా లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. - కేవీ శేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి చెడ్డ పేరు బదిలీల విషయంలో కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కొత్త బదిలీ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. వెబ్ కౌన్సెలింగ్, ఫెర్మార్మెన్స్ విధానాలను రద్దు చేయాలి. - అరవ విస్సు, ఉపాధ్యాయుడు, ద్రాక్షారామ, రామచంద్రపురం మండలం ఖాళీలపై దృష్టి పెట్టండి పిఠాపురం : జిల్లాలో ఈ నెలాఖరుకు సుమారు 180 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ ఖాళీల భర్తీకి కూడా బదిలీల సందర్భంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఈ నెల పదో తేదీకే పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో దానిని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ఆయా పాఠశాలల్లో ఖాళీలు అలాగే ఉండిపోయి, విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు. -
మహిళా సీఐ శ్రీదేవిపై బదిలీ వేటు
హైదరాబాద్ : లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ మహిళా సీఐ శ్రీదేవిపై బదిలీ వేటు పడింది. ఆమెను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ధర్నాచౌక్ వద్దంటూ చేపట్టిన శిబిరంలో నిన్న సీఐతో పాటు కొందరు మహిళా కానిస్టేబుళ్లు సాధారణ దుస్తులతో ఫ్లకార్డులు పట్టుకుని అందరి మధ్య కూర్చున్నారు. అయితే మీడియా ఈ విషయాన్ని గుర్తించడంతో కొంతసేపటికి వాళ్లంతా ప్లకార్డులను అక్కడ పడేసి వెళ్లిపోయారు. ఇలా ధర్నాలో కూర్చున్న మహిళా సీఐ... మధ్యాహ్నం పోలీసు యూనిఫాంలో తిరిగి ధర్నా చౌక్ వద్దకు వచ్చి, విధులు నిర్వర్తించారు. దీంతో ప్రభుత్వమే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు లేక్ వ్యూ పీఎస్ నుంచి సీఐ శ్రీదేవిని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. విచారణ అనంతరం ఆమెపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ధర్నాలో పాల్గొన్న ఇతర కానిస్టేబుళ్లను కూడా వివరణ కోరినట్లు డీసీపీ చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించినట్లు డీసీపీ తెలిపారు. -
ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం
-సంఘాలతో చర్చించని సర్కారు -నిబంధనలపై టీచర్ల అభ్యంతరం -రేషనలైజేషన్‌పై విద్యాశాఖ కసరత్తు రాయవరం : రేపటితో విద్యా సంవత్సరం ముగియనుంది. ఉపాధ్యాయుల దృష్టంతా బదిలీలపైనే ఉంది. ఉపాధ్యాయ బదిలీలు వేసవి సెలవుల్లో చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. బదిలీల విషయమై విద్యాశాఖ తయారు చేసిన ముసాయిదాలో పేర్కొన్న నిబంధలనపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మేనేజ్మెంట్ కింద దాదాపుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా బదిలీలపై ఆశలు పెట్టుకున్నారు. నిబంధనలపై వీడని పీటముడి.. ఉపాధ్యాయ బదిలీల్లో ఇప్పుడు పాయింట్ల విధానం పైనే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. పాయింట్లు కేటాయించే విధానం, వెబ్ కౌన్సెలింగ్, బదిలీలకు సర్వీసు నిబంధనపైనే ప్రధానంగా టీచర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెర్ఫార్మెన్స్ పాయింట్లపై టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని, ఎనిమిదేళ్ల సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కీలకం కానున్న రేషనలైజేషన్.. విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి నెలాఖరు వరకు రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే బదిలీలకు కీలకం కానుంది. 10 మంది లోపు పిల్లలున్న పాఠశాల ఉంటే ..ఒక కిలోమీటరు పరిధిలో పాఠశాల కూడా ఉండి ఉంటే దానిని పిల్లలు ఉన్న పాఠశాలలో విలీనం చేయాల్సి ఉంటుంది. కిలోమీటరు పరిధిలో ఏ పాఠశాలా లేకుంటే అక్కడే పాఠశాలను కొనసాగించాలి. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులుంటే ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాల(6, 7 తరగతులు)లో 40 మంది లోపు విద్యార్థులుంటే సమీప పాఠశాలల్లో విలీనం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 60–70 మంది విద్యార్థులుంటే ఆ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. మూడు కిలోమీటర్ల పరిధిలో ఒకటికి మించి ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని సమీపంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్కూల్లో కలపాలని యోచిస్తోంది. అయితే ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో రేషనలైజేషన్ నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభ్యంతరాలపై చర్చించాలి బదిలీ నిబంధనలపై ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదు. ఈ నెల 19న పలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిబంధనలపై సంఘాలు, ఎమ్మెల్సీలతో చర్చించి బదిలీల షెడ్యూల్‌ను కచ్చితంగా విడుదల చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్, అసంబద్ధ నిబంధలనపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణకు ఉపాధ్యాయ సంఘాలు సమావేశం కానున్నట్టు సమాచారం. సంఘాలు లేవనెత్తే పలు అంశాలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు ఉపాధ్యాయ సంఘాలు సన్నద్ధం కానున్నాయి. వెబ్ కౌన్సెలింగ్‌కు పూర్తిగా వ్యతిరేకం.. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెబ్ కౌన్సెలింగ్ ఉంటే బదిలీలను వ్యతిరేకిస్తాం. –డి.వి.రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ పెర్ఫార్మెన్స్ పాయింట్లు తొలగించాలి.. బదిలీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. బదిలీల పేరుతో పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఇస్తామనడం ప్రభుత్వ నిరంకుశత్వ దోరణికి నిదర్శనం. పెర్ఫార్మెన్స్ పాయింట్లు లేకుండా బదిలీలు చేపట్టాలి. – కవిశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ ( ఆందోళనకు గురవుతున్నారు.. బదిలీల షెడ్యూల్ విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. వేసవి సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. బదిలీల్లో అసంబద్ధ నిబంధనలను సంఘాలన్నీ ఏకమై వ్యతిరేకిస్తాం. – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
కాప్రా సహాయ వైద్యాధికారిపై బదిలీ వేటు
హైదరాబాద్: అనేక ఆరోపణల నేపథ్యంలో కాప్రా మున్సిపాలిటీలో సహాయ వైద్యాధికారిపై బదిలీ వేటు పడింది. కాప్రాలో ఏఎంహెచ్‌వోగా పనిచేస్తున్న రాహుల్‌పై వసూళ్లకు పాల్పడటంతోపాటు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ వచ్చిన ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమేనని తేలటంతో ఆయన్ను ప్రజారోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నీతూప్రసాద్ రూటెటు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు ప్రధాని బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇక్కడ కొనసాగుతారా లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి గురు, శుక్రవారాల్లో వచ్చే సీల్డ్కవర్పైనే దీనిపై స్పష్టత వస్తుందని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం సీల్డ్‌కవర్ వచ్చినా క్రిస్మస్ సెలవు కావడంతో శుక్రవారమే విషయం వెల్లడి కానుంది. విభజన అనంతర పరిణామాల్లో కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఏపీఎస్పీ కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఆమె భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అఖిలభారత సర్వీసు అధికారుల విషయం కేంద్రప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆరు నెలలుగా కలెక్టర్ బదిలీ విషయం తేలలేదు. ఇపుడు అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో నీతూప్రసాద్ జిల్లాలో కొనసాగేది లేనిదీ మరో 24 గంటల్లోపు తేలిపోనుంది. తెలంగాణాకు మొదట్లో ఆప్షన్ ఇచ్చినప్పటికీ, భర్త గుంటూరులో పనిచేస్తుండటం, ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు దగ్గరపడడం వంటి పరిణామాల నేపథ్యంలో నీతూప్రసాద్ తెలంగాణకు వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల ఆమెను ఇక్కడే కొనసాగాలని ఇప్పటికే కోరారు. అయితే ఇప్పుడు కేంద్రం విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె అటా, ఇటా అనే దానిపై ఒక నిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైంది. 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా నీతూప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కొద్దిరోజులకే ఆమె భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా వచ్చారు. విజయవాడ- గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్న తరుణంలో కీలకమైన గుంటూరు అర్బన్ ఎస్పీ పోస్టుకి ఆయన బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఆంధ్రాలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలియవచ్చింది. మరోవైపు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో కొత్త అధికారులను తీసుకువస్తే వారు అలవాటు పడేందుకు చాలా సమయం పడుతుందని..ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఉన్నారంటున్నారు. అందుకే నీతూప్రసాద్నే పుష్కరాల వరకూ కలెక్టర్‌గా కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణకు వెళ్లేందుకు ఎంచుకున్న ఆప్షన్‌ను కేంద్రం యథాతథంగా ఆమోదిస్తే పరిస్థితి ఏమిటనే విషయమై ఆసక్తి నెలకొంది. ఆమెకు వెంటనే కలెక్టర్‌గా అక్కడ అవకాశం దక్కుతుందా లేదా? అక్కడకు వెళితే పదోన్నతులు త్వరగా వస్తాయా...ఇత్యాది విషయాలపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కనీసం పుష్కరాల వరకు ఆమె కొనసాగుతారా? ఈలోపే జిల్లా నుంచి బదిలీ అవుతారా అనే ఆసక్తి నేపథ్యంలో అసలు సీల్డ్కవర్లో ఏముందనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.