గురువుల్లో గందరగోళం
గురువుల్లో గందరగోళం
Published Sun, Jun 18 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM
- రోజురోజుకూ మారుతున్న బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్
- పాయింట్ల కేటాయింపులో అస్పష్టత
- లోపభూయిష్ట విధానాలపై ఉపాధ్యాయుల అసంతృప్తి
- ఇంకా పూర్తికాని రేషనలైజేషన్ ప్రక్రియ
రాయవరం (మండపేట) / రామచంద్రపురం రూరల్ : ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్.. మరోవైపు ఉపాధ్యాయుల సర్దుబాటు.. వీటికితోడు ఇప్పుడు బదిలీల ప్రక్రియ.. పాఠశాలలు పునఃప్రారంభమైన అనంతరం ఇచ్చిన ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ రోజురోజుకూ మారుతోంది. ఈ షెడ్యూల్, ప్రక్రియ అంతా గందరగోళంగా ఉండడంతో అయ్యవార్లు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడికి, 23న సచివాలయం దిగ్బంధానికి ఉపాధ్యాయ ఉమ్మడి సంఘాల కార్యాచరణ వేదిక జాక్టో ఇప్పటికే పిలుపునిచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఏం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొందని ఉపాధ్యాయ నేతలు అంటున్నారు. దీనికి బదులు సాధారణ కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించాలని, దీనివల్ల ఉన్న ఖాళీల్లో తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉపాధ్యాయులకుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సలహాలు, సంప్రదింపులతో ఉపాధ్యాయుల మధ్య కొంతమేర సర్దుబాటు చేసుకునే వెసులుబాబు కూడా ఉంటుందని సూచిస్తున్నారు.
సరికొత్త సమస్యలు
- బదిలీల కోసం ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఇందులో బదిలీల ఆప్షన్లు ప్రత్యక్షమవుతున్నప్పటికీ సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
- ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు, ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో కనిపించే వివరాలకు పొంతన ఉండడంలేదు. దీంతో పలువురు ఉపాధ్యాయులు మార్కులు కోల్పోతున్నారు.
- కొందరు అదనపు పాయింట్ల కోసం తప్పుడు సమాచారం నమోదు చేస్తున్నారు. దీంతో ప్రతిభ ఆధారంగా పొందాల్సిన అదనపు పాయింట్లు కోల్పోతున్నామని అర్హులు ఆవేదన చెందుతున్నారు.
- నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తయిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఎస్‌జీటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 15,424 మంది ఉపాధ్యాయులున్నారు. బదిలీలు తప్పనిసరి అయినవారు అన్ని కేటగిరీలూ కలిపి జెడ్పీ యాజమాన్యంలో 4,491 మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 150 మంది వరకు ఉన్నారు. బదిలీ అర్హత కలిగిన వారు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వెబ్‌సైట్‌లోని ఆప్షన్ల వల్ల వీరంతా ఆందోళన చెందుతున్నారు.
పాయింట్ల కేటాయింపులోనూ..
- పాయింట్ల కేటాయింపులో అసమగ్రత చోటు చేసుకోవడం ఉపాధ్యాయులను కలవరానికి గురి చేస్తోంది.
- ప్రాథమికోన్నత పాఠశాలల్లోని భాషా పండితులకు ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయించలేదు. ఏ స్థాయిలో పాయింట్ల కోసం నమోదు చేసుకోవాలన్నది వివరించలేదు.
- ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్‌జీటీలకు స్కూల్ గ్రేడ్ పాయింట్, క్లాస్ గ్రేడ్ పాయింట్ కన్పిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్‌జీటీలకు క్లాస్ గ్రేడ్ పాయింట్లు మాత్రమే పొందుపరిచారు.
- ప్రాథమిక పాఠశాలల్లో ఒకే స్థాయి ఉపాధ్యాయుల్లో ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయుడికి మాత్రమే పాయింట్లు ఇస్తున్నట్లు వెబ్ దరఖాస్తులో ఉంది.
- ఎనిమిది సంవత్సరాల్లో స్పౌజ్ పాయింట్‌ను ఉపయోగించుకుంటే ఐదు పాయింట్లు ఇస్తారు. ఎనిమిదేళ్లు పూర్తయినవారు బదిలీకి అర్హులని నిబంధన పెట్టడంతో.. అంతకంటే తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు గతంలో స్పౌజ్ వాడుకుంటే ప్రస్తుత బదిలీల్లో అదనపు పాయింట్లు ఉండవు.
- మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు ఉపాధ్యాయులందరూ నిర్వహిస్తున్నప్పటికీ హెచ్‌ఎంకు మాత్రమే ఒక పాయింటు కేటాయిస్తున్నారు.
- ఒక పాఠశాలలో ఐదో తరగతి చదివిన విద్యార్థులందరూ వేరొక పాఠశాలలో ఆరో తరగతిలో చేరితేనే ఉపాధ్యాయులకు 5 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరు మానేసినా ఉపాధ్యాయులకు ఒక్క పాయింటు కూడా కేటాయించడం లేదు. వాస్తవానికి విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టిన తరువాత వేరొక పాఠశాలలో చేరడం అనేది తల్లిదండ్రుల బాధ్యతే తప్ప ఉపాధ్యాయులకు సంబంధం లేని విషయం.
- ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందినవారికి పాయింట్లు కేటాయించడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వమే గుర్తించి ఇవ్వాలి తప్ప, తాను ఉత్తమ ఉపాధ్యాయుడినని, తనకు అవార్డు ఇవ్వాలని దరఖాస్తు చేసుకునే పద్ధతి నచ్చక.. అర్హతలున్నా అవార్డులకు దరఖాస్తు చేయని ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. ఈ నిబంధనల వల్ల బదిలీల్లో వారికి అన్యాయం జరుగుతుంది.
- తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో నలుగురు విద్యార్థులు చేరితే, ఉన్న విద్యార్థులతో పోల్చి శాతం లెక్కించి, అధిక పాయింట్లు ఇస్తున్నారు. అదే ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలో అదే నలుగుగురు విద్యార్థులు చేరితే శాతం లెక్కిస్తే తక్కువ వస్తుంది. అయినప్పటికీ దీని ప్రకారం వారికి తక్కువ పాయింట్లు కేటాయిస్తున్నారు. ఒక్కోసారి ఒక్క పాయింటు కూడా రాని పరిస్థితి.
- ఇంకా విచిత్రం ఏమిటంటే అన్ని రకాలుగా ఒకే అర్హతలున్న ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పాయింట్లు కేటాయించడంతో ఉపాధ్యాయుల్లో మరింత ఆందోళన నెలకొంటోంది.
రేషనలైజేషన్‌పై కానరాని స్పష్టత
ఇదిలా ఉండగా పాఠశాలల రేషనలైజేషన్‌పై చిక్కుముడి ఇంకా వీడలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించే ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ జీఓ నంబరు 29 విడుదల చేసింది. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ ప్రారంభించి సుమారు 15 రోజులవుతున్నా నేటికీ స్పష్టత కానరావడం లేదు. రేషనలైజేషన్‌తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉంది. రేషనలైజేషన్‌పై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ దరఖాస్తుల గడువును పెంచుకుంటూ పోతుంది. రేషనలైజేషన్‌లో ఎక్కడెక్కడ ఏయే స్కూల్స్ విలీనమవుతాయి? ఏయే స్కూళ్లు మూత పడనున్నాయనే విషయం స్పష్టమైతేనే బదిలీల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.
నత్తనడకన నమోదు
పాయింట్ల కేటాయింపుపై అయోమయం చోటు చేసుకోవడంతో జిల్లాలో బదిలీ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 12 నుంచి బదిలీ దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు గడువు పెంచారు. ఈ నెల 15, 16 తేదీల్లో అధిక సంఖ్యలో నమోదు జరిగింది. ఈ నెల 16వ తేదీ వరకూ 3,715 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వెబ్ కౌన్సెలింగ్‌లో పారదర్శకత లేదు
ఉపాధ్యాయ బదిలీలల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ప్రకటించింది. కానీ ఈ విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. పారదర్శకత అన్న దానికి ఎక్కడా అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ విధానంలో ఏం జరుగుతుందనే దానికి జవాబుదారీతనం కూడా లేదు. ఏం జరుగుతుందని అడిగితే హెల్‌్ప లైన్ నంబరు అంటున్నారు. అక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. వేసవి సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలను విద్యా సంవత్సరం ఆరంభంలో చేపట్టడం, విధి విధానాలు సరిగ్గా లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
- కేవీ శేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వానికి చెడ్డ పేరు
బదిలీల విషయంలో కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కొత్త బదిలీ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. వెబ్ కౌన్సెలింగ్, ఫెర్మార్మెన్స్ విధానాలను రద్దు చేయాలి.
- అరవ విస్సు, ఉపాధ్యాయుడు, ద్రాక్షారామ, రామచంద్రపురం మండలం
ఖాళీలపై దృష్టి పెట్టండి
పిఠాపురం : జిల్లాలో ఈ నెలాఖరుకు సుమారు 180 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ ఖాళీల భర్తీకి కూడా బదిలీల సందర్భంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఈ నెల పదో తేదీకే పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో దానిని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ఆయా పాఠశాలల్లో ఖాళీలు అలాగే ఉండిపోయి, విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు.
Advertisement
Advertisement