
ఇమ్మడిశెట్టికి కన్నీటి వీడ్కోలు
శ్రీశైలం ప్రాజెక్టు: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన భౌతిక కాయానికి శనివారం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో విజయవాడలో శుక్రవారం మృతి చెందగా.. ఆయన భౌతిక కాయాన్ని శనివారం తెల్లవారుజామున శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించారు. అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవురావు, సినీ నటీమణులు కవిత, పూజిత, ఏపీ జెన్‌కో డైరెక్టర్ అప్పారావు, యువ పారిశ్రామికవేత్త టీ జి భరత్, ఆర్యవైశ్యమహాసభ మాజీ అధ్యక్షులు, నెల్లూరు డిప్యూటీ మేయర్, ఆవోపా, మర్చంట్ అసోసియేషన్ నాయకులు డి.వి నారాయణ, సొల్లేటి సత్యనారాయణ, గాదంశెట్టి సుబ్బారావు, చల్లా కిషోర్, గాదంశెట్టి వెంకటేశ్వర్లు, కొత్త వెంకటేశ్వరరావు, మహేష్, శ్రీను, ఏఎఎల్ ప్రసాద్ తదితరులు నివాళులు అర్పించారు.
ప్రకాశం జిల్లా బుక్కాపురంలో జన్మించిన కోటేశ్వరరావు హైస్కూల్ చదువులకు స్వస్తి పలికి డ్యాం నిర్మాణ సమయంలో తన 12వ ఏట శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు భార్య సత్యవతి, కుమార్తెలు పూజిత, అర్షితలు ఉన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ముఖ్య అనుచరుడుగా ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు మెలిగారు. ఆయన మృతి పట్ల స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సేవా సంస్కర్తను కోల్పోవడం బాధాకరం: మంత్రి సిద్ధా రాఘవరావు
నిరంతరం సేవా కార్యక్రమాలలో మునిగి ఉన్న ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు అకాల మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని, రాష్ట్ర అటవీశాఖ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. కోటేశ్వరరావు భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చిన ఆయన కోటేశ్వరరావుతో ఉన్న సానిహిత్యాన్ని పంచుకున్నారు. ఆర్యవైశ్యుల ఎదుగుదల కోసం సేవా కార్యక్రమాలలో కోటేశ్వరరావు ఎంతో కష్టపడ్డారన్నారు.