వారమైనా జీతం రాలే!
♦ డీటీఓ వేతన చెల్లింపుల్లో సాంకేతికలోపం
♦ 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతం
♦ ‘ఈ-పేమెంట్స్’ పద్ధతితో ప్రతినెలా ఇదేతీరు
♦ ప్రహసనంగా కొత్త పద్ధతి
పోలీసు శాఖతోపాటు అన్ని జిల్లా శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన చెల్లింపులన్నీ డీటీఓ (డిస్ట్రిక్ ట్రెజరీ కార్యాలయం) ద్వారా జరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతికలోపంతో వీరి వివరాలన్నీ అప్‌లోడ్ కాలేదు. దీంతో జీతాలన్నీ నిలిచిపోయాయి. సుమారు 15 వేల మంది వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ‘ఈ -పేమెంట్స్’ పద్ధతి ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టెస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన తీసుకోవాల్సిన వేతన సొమ్మును నాలుగైదు రోజులు ఆలస్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ (ఈ-పేమెంట్స్) పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రక్రియను తొలుత జిల్లా ఖజానా కార్యాలయాల(డీటీఓ) పరిధిలో అమలు చేసింది. మూడు నెలలుగా ఈ -పేమెంట్స్ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారు. ఈ -పేమెంట్స్ పద్ధతిలో బ్యాంకు స్థాయిలో చేయాల్సిన పనిని నేరుగా ఖజానా శాఖ పరిధిలోనే పూర్తి చేస్తూ ఉద్యోగుల వేతనాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
తాజాగా డీటీఓ కార్యాలయంలో వేతనాలు అప్‌లోడ్ చేసే ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జిల్లాలోని అన్ని శాఖల కార్యాలయ ఉద్యోగులకు ఈనెల వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది.
15 వేల మంది ఎదురుచూపు..
పోలీసు శాఖతోపాటు అన్ని జిల్లా శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన చెల్లింపులన్నీ డీటీఓ (డిస్టిక్ ట్రెజరీ కార్యాలయం) ద్వారా జరుగుతున్నాయి. ప్రతినెలా దాదాపు 15వేల మంది ఉద్యోగుల వేతనాలకు సంబంధించి డ్రాయింగ్ అధికారులు డీటీఓకు నివేదికలు అందిస్తారు. వీటన్నింటినీ ఈ-పేమెంట్స్ ద్వారా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసి వివరాల్ని బ్యాంకులకు అందిస్తున్నారు. అయితే మార్చి నెలకు సంబంధించి యధావిధిగా వివరాల్ని అప్‌లోడ్ చేశారు. కానీ సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతికలోపంతో వివరాలు అప్‌లోడ్ కాలేదు. దీంతో ఉద్యోగుల వేతనాలన్నీ నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం వరకూ సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో జీతాల ప్రక్రియ కొలిక్కి రాలేదు. సాయంత్రంలోపు సాంకేతిక సమస్యను అధిగమిస్తామని, వీలైనంత త్వరితంగా ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని జిల్లా ఖజానాశాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.పద్మజ ‘సాక్షి’తో పేర్కొన్నారు.