e-payments
-
ఎకానమీని ప్రభావితం చేసే ఈ–పేమెంట్లు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఈ–పేమెంట్లు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఆర్థిక వ్యవస్థను ఈ పేమెంట్లు ప్రభావితం చేస్తాయని తెలిపారు. ‘ఈ–పేమెంట్లు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత’అనే అంశాలపై ఆసియా దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్లకు ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని నరసింహన్ సోమవారం రాజ్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ద్వారా 2020 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని అన్నారు. తద్వారా ఇండియా జీడీపీ 15 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. బలహీనవర్గాల ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచేలా పొదుపు, పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీల్లో భాగస్వాములను చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య, అడిషనల్ డైరెక్టర్ జనరల్ హర్ ప్రీత్ సింగ్, ఇండోనేసియా, కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియాల సివిల్ సర్వెంట్లు పాల్గొన్నారు. -
పీఓఎస్ పరికరాలపై పన్నుల్లేవ్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా దేశంలో ఈ–చెల్లింపులను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక చర్య చేపట్టింది. నగదు రహిత లావాదేవీల ప్రక్రియలో ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాలపై అన్ని రకాల డ్యూటీలు తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. పీఓఎస్ పరికరాలైన కార్డు రీడర్లు, ఎంపీఓఎస్ మైక్రో ఏటీఎంలు (1.5.1 వెర్షన్ ), వేలిముద్ర రీడర్లు, స్కానర్లు, ఐరిస్ స్కానర్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ), ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ), స్పెషల్ అడిషనల్ డ్యూటీ (ఎస్ఏడీ) నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పరికరాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఆయా పరికరాల్లో ఉపయోగించే విడిభాగాలకూ పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేంద్రం నిర్ణయాన్ని ఎల్సినా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. ఈ చర్య డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. అయితే పన్ను మినహాయింపును తక్షణ అవసరాలను తీర్చుకునేందుకే పరిమితం చేయాలని సూచించింది. పన్ను మినహాయింపును దీర్ఘకాలం కొనసాగించడం వల్ల విదేశీ మార్కెట్ల నుంచి పీఓఎస్ పరికరాలు భారీ స్థాయిలో ముంచెత్తవచ్చని ఎల్సినా సెక్రటరీ రాజూ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపును పూర్తి ఆర్థిక సంవత్సరంపాటు ఇవ్వకూడదని సూచించారు. -
ఈ-పేమెంట్ చేసేవారికి నీతిఆయోగ్ బొనాంజా!
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలు చేస్తున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చే ఆలోచనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం ఎలక్ట్రానిక్ పేమెంట్లను చేస్తున్న వినియోగదారులకు ఈ ఆఫర్ ను వర్తింపజేయాలనే నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రూ.కోటి నగదు బహుమతితో పలు రకాల ఆకర్షణీయ ఆఫర్ లు ఉన్నట్లు సమాచారం. పథకం రూపొందించడంలో కీలక భూమిక పోషించాలని నేషనల్ పేమెంట్ కార్పొరరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ)ను నీతి ఆయోగ్ కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్లూసన్ ఫండ్ నుంచి రూ.125కోట్లను ఎన్ పీసీఐకు నీతిఆయోగ్ కేటాయించింది. ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సిటీ బ్యాంకు, హెచ్ఎస్ బీసీ బ్యాంకుల రీటైల్ పేమెంట్లన్నీ ఎన్ పీసీఐ పరిధిలోనే జరుగుతాయి. గ్రామీణ, చిన్న పట్టణాల ప్రాంతాల ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. దేశంలో జరిగిన అన్ని నగదు రహిత లావాదేవీల ఐడీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రా తీసి రూ.కోటి బహుమతిని, ప్రతి వారం తీసే డ్రాలో రూ.10లక్షల బహుమతిని అందజేస్తారని తెలిపారు. ప్రతివారం పది మంది వినియోగదారులకు, పది మంది వ్యాపారులకు బహుమతులు ఇస్తారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిసింది. -
కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం
డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్ అంశాలపై చర్చ న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టాప్ బిలియనీర్ అరుున బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో గురువారం సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్, ఈ-అగ్రికల్చర్ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి అపార వృద్ధి అవకాశాలు ఉన్నారుు. ఇది తమకు అనుకూలమైన సమయమని భావిస్తున్నాం’ అని బిల్ గేట్స్ సమావేశం అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని కొత్త అప్లికేషన్‌సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రధాన్యమిస్తాం. మా ఫౌండేషన్ కూడా వీటిపైనే ప్రధానంగా దృష్టికేంద్రీకరిస్తుంది’ అని వివరించారు. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’కి బిల్ గేట్స్ సహవ్యవస్థాపకుడు అనే విషయం తెలిసిందే. ‘ఈ-అగ్రికల్చర్, డిజిటల్ హెల్త్, ఈ-పేమెంట్స్ వంటి అంశాలపై బిల్ గేట్స్ తన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆధార్, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి అంశాల గురించి నేను గేట్స్‌కు వివరించాను’ అని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. -
వారమైనా జీతం రాలే!
♦ డీటీఓ వేతన చెల్లింపుల్లో సాంకేతికలోపం ♦ 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతం ♦ ‘ఈ-పేమెంట్స్’ పద్ధతితో ప్రతినెలా ఇదేతీరు ♦ ప్రహసనంగా కొత్త పద్ధతి పోలీసు శాఖతోపాటు అన్ని జిల్లా శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన చెల్లింపులన్నీ డీటీఓ (డిస్ట్రిక్ ట్రెజరీ కార్యాలయం) ద్వారా జరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతికలోపంతో వీరి వివరాలన్నీ అప్లోడ్ కాలేదు. దీంతో జీతాలన్నీ నిలిచిపోయాయి. సుమారు 15 వేల మంది వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ‘ఈ -పేమెంట్స్’ పద్ధతి ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టెస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన తీసుకోవాల్సిన వేతన సొమ్మును నాలుగైదు రోజులు ఆలస్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ (ఈ-పేమెంట్స్) పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రక్రియను తొలుత జిల్లా ఖజానా కార్యాలయాల(డీటీఓ) పరిధిలో అమలు చేసింది. మూడు నెలలుగా ఈ -పేమెంట్స్ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారు. ఈ -పేమెంట్స్ పద్ధతిలో బ్యాంకు స్థాయిలో చేయాల్సిన పనిని నేరుగా ఖజానా శాఖ పరిధిలోనే పూర్తి చేస్తూ ఉద్యోగుల వేతనాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా డీటీఓ కార్యాలయంలో వేతనాలు అప్లోడ్ చేసే ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జిల్లాలోని అన్ని శాఖల కార్యాలయ ఉద్యోగులకు ఈనెల వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. 15 వేల మంది ఎదురుచూపు.. పోలీసు శాఖతోపాటు అన్ని జిల్లా శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన చెల్లింపులన్నీ డీటీఓ (డిస్టిక్ ట్రెజరీ కార్యాలయం) ద్వారా జరుగుతున్నాయి. ప్రతినెలా దాదాపు 15వేల మంది ఉద్యోగుల వేతనాలకు సంబంధించి డ్రాయింగ్ అధికారులు డీటీఓకు నివేదికలు అందిస్తారు. వీటన్నింటినీ ఈ-పేమెంట్స్ ద్వారా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేసి వివరాల్ని బ్యాంకులకు అందిస్తున్నారు. అయితే మార్చి నెలకు సంబంధించి యధావిధిగా వివరాల్ని అప్లోడ్ చేశారు. కానీ సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సాంకేతికలోపంతో వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో ఉద్యోగుల వేతనాలన్నీ నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం వరకూ సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో జీతాల ప్రక్రియ కొలిక్కి రాలేదు. సాయంత్రంలోపు సాంకేతిక సమస్యను అధిగమిస్తామని, వీలైనంత త్వరితంగా ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని జిల్లా ఖజానాశాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.పద్మజ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘ఇ- పేమెంట్’ నిల్
సాక్షి, ఒంగోలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉద్యోగులు, పెన్షన్‌దారుల జీతభత్యాల విడుదల్లో సమస్యలొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వోద్యోగుల్లో చర్చనీయాంశమైన వ్యవహారం ‘ఇ-పేమెంట్స్’. ఈ విధానం ద్వారా ఉద్యోగులు శరవేగంగా జీతాలు తీసుకోవాలనే ఉద్దేశం ఏమోగానీ.. వారికి ఆగస్టు నెల జీతం ఇంత వరకు ఖాతాల్లో జమకాలేదు. ఒకటో తేదీనే జీతం వస్తుందని.. ముందస్తు కుటుంబ ఖర్చుల ప్రణాళిక తయారు చేసుకునే మధ్యతరగతి ఉద్యోగులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 37,647 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా, పెన్షన్‌దారులు మరో 21,398 మంది ప్రభుత్వ ఖజనా శాఖ నుంచి డబ్బు తీసుకుంటుంటారు. వీరికి ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌భత్యం అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాల బిల్లులు సంబంధిత శాఖ కార్యాలయం నుంచి ట్రెజరీకి అందాక.. అక్కడ బిల్లులు పాస్ చేయించుకుని బ్యాంకుల్లో ఇస్తే వారు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు జమచేసేవారు. అయితే కొత్తగా పాలనాపగ్గాలు చేపట్టిన చంద్రబాబు ‘ఇ-పేమెంట్స్’ విధానాన్ని తెరమీదికి తెచ్చారు. ఖజానా శాఖలో మంజూరైన బిల్లులను మళ్లీ బ్యాంకుల ద్వారా ఉద్యోగులు ‘ఇ- పేమెంట్స్’ వెబ్సైట్లో నమోదుచేయాల్సి ఉంది. ఖజానా సిబ్బంది ఆ వివరాలను సరిచూసి బ్యాంకుల ద్వారా నగదును ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఖజానా సిబ్బందికి ఈ పని పూర్తిగా కొత్త కావడంతో సమస్యలొస్తున్నాయి. సాంకేతికంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించడంలో.. ఉద్యోగుల సంఖ్యతో పాటు వారి సర్వీసు వివరాలను నమోదుచేయడంలో పొరపాటు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులిచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు కొన్ని విరుద్ధంగా ఉండటం, ఆన్లైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయకపోవడం, ట్రజరీ ఉద్యోగులకు నూతన పని విధానం కావడంతో ఉద్యోగుల జీతాలు వారి వ్యక్తిగత ఖాతాలకు నేటికీ జమచేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని గుర్తించిన ఒంగోలు జిల్లా ఖజానాశాఖ కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండ్రోజుల్లో జీతాలు పడతాయి లక్ష్మీకుమారి, జిల్లా ఖజానాశాఖ అధికారి ‘ఇ-పేమెంట్’ విధానం కొత్తగా అమలు చేస్తున్న క్రమంలో కంప్యూటర్లో ఉద్యోగుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంది. దీంతో జాబితాల్లో చిన్నచిన్న (కామాలు, పుల్‌స్టాప్‌లు తేడాలొచ్చినా) తప్పులున్నా ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమకాదు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించాము. మరో రెండ్రోజుల్లో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు నగదు ఖాతాల్లో జమవుతుంది.