పీఓఎస్ పరికరాలపై పన్నుల్లేవ్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా దేశంలో ఈ–చెల్లింపులను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక చర్య చేపట్టింది. నగదు రహిత లావాదేవీల ప్రక్రియలో ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాలపై అన్ని రకాల డ్యూటీలు తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. పీఓఎస్ పరికరాలైన కార్డు రీడర్లు, ఎంపీఓఎస్ మైక్రో ఏటీఎంలు (1.5.1 వెర్షన్ ), వేలిముద్ర రీడర్లు, స్కానర్లు, ఐరిస్ స్కానర్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ), ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ), స్పెషల్ అడిషనల్ డ్యూటీ (ఎస్‌ఏడీ) నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పరికరాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఆయా పరికరాల్లో ఉపయోగించే విడిభాగాలకూ పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.
నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
కేంద్రం నిర్ణయాన్ని ఎల్సినా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. ఈ చర్య డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. అయితే పన్ను మినహాయింపును తక్షణ అవసరాలను తీర్చుకునేందుకే పరిమితం చేయాలని సూచించింది. పన్ను మినహాయింపును దీర్ఘకాలం కొనసాగించడం వల్ల విదేశీ మార్కెట్ల నుంచి పీఓఎస్ పరికరాలు భారీ స్థాయిలో ముంచెత్తవచ్చని ఎల్సినా సెక్రటరీ రాజూ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపును పూర్తి ఆర్థిక సంవత్సరంపాటు ఇవ్వకూడదని సూచించారు.