‘ఇ- పేమెంట్’ నిల్ | employees not received salaries through E-payment | Sakshi
Sakshi News home page

‘ఇ- పేమెంట్’ నిల్

Published Sun, Sep 7 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

employees not received salaries through E-payment

సాక్షి, ఒంగోలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉద్యోగులు, పెన్షన్‌దారుల జీతభత్యాల విడుదల్లో సమస్యలొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వోద్యోగుల్లో చర్చనీయాంశమైన వ్యవహారం ‘ఇ-పేమెంట్స్’. ఈ విధానం ద్వారా ఉద్యోగులు శరవేగంగా జీతాలు తీసుకోవాలనే ఉద్దేశం ఏమోగానీ.. వారికి ఆగస్టు నెల జీతం ఇంత వరకు ఖాతాల్లో జమకాలేదు.

ఒకటో తేదీనే జీతం వస్తుందని.. ముందస్తు కుటుంబ ఖర్చుల ప్రణాళిక తయారు చేసుకునే మధ్యతరగతి ఉద్యోగులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 37,647 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా, పెన్షన్‌దారులు మరో 21,398 మంది ప్రభుత్వ ఖజనా శాఖ నుంచి డబ్బు తీసుకుంటుంటారు. వీరికి ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌భత్యం అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాల బిల్లులు సంబంధిత శాఖ కార్యాలయం నుంచి ట్రెజరీకి అందాక.. అక్కడ బిల్లులు పాస్ చేయించుకుని బ్యాంకుల్లో ఇస్తే వారు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు జమచేసేవారు. అయితే కొత్తగా పాలనాపగ్గాలు చేపట్టిన చంద్రబాబు ‘ఇ-పేమెంట్స్’ విధానాన్ని తెరమీదికి తెచ్చారు. ఖజానా శాఖలో మంజూరైన బిల్లులను మళ్లీ బ్యాంకుల ద్వారా ఉద్యోగులు ‘ఇ- పేమెంట్స్’ వెబ్‌సైట్‌లో నమోదుచేయాల్సి ఉంది. ఖజానా సిబ్బంది ఆ వివరాలను సరిచూసి బ్యాంకుల ద్వారా నగదును ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

 దీంతో ఖజానా సిబ్బందికి ఈ పని పూర్తిగా కొత్త కావడంతో సమస్యలొస్తున్నాయి. సాంకేతికంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించడంలో.. ఉద్యోగుల సంఖ్యతో పాటు వారి సర్వీసు వివరాలను నమోదుచేయడంలో పొరపాటు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులిచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు కొన్ని విరుద్ధంగా ఉండటం, ఆన్‌లైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయకపోవడం, ట్రజరీ ఉద్యోగులకు నూతన పని విధానం కావడంతో ఉద్యోగుల జీతాలు వారి వ్యక్తిగత ఖాతాలకు నేటికీ జమచేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని గుర్తించిన ఒంగోలు జిల్లా ఖజానాశాఖ కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 రెండ్రోజుల్లో జీతాలు పడతాయి లక్ష్మీకుమారి,  జిల్లా ఖజానాశాఖ అధికారి
 ‘ఇ-పేమెంట్’ విధానం కొత్తగా అమలు చేస్తున్న క్రమంలో కంప్యూటర్‌లో ఉద్యోగుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంది. దీంతో జాబితాల్లో చిన్నచిన్న (కామాలు, పుల్‌స్టాప్‌లు తేడాలొచ్చినా) తప్పులున్నా ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమకాదు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించాము. మరో రెండ్రోజుల్లో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు నగదు ఖాతాల్లో జమవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement