కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం
డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్ అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టాప్ బిలియనీర్ అరుున బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో గురువారం సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్, ఈ-అగ్రికల్చర్ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి అపార వృద్ధి అవకాశాలు ఉన్నారుు. ఇది తమకు అనుకూలమైన సమయమని భావిస్తున్నాం’ అని బిల్ గేట్స్ సమావేశం అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది.
ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని కొత్త అప్లికేషన్‌సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రధాన్యమిస్తాం. మా ఫౌండేషన్ కూడా వీటిపైనే ప్రధానంగా దృష్టికేంద్రీకరిస్తుంది’ అని వివరించారు. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’కి బిల్ గేట్స్ సహవ్యవస్థాపకుడు అనే విషయం తెలిసిందే. ‘ఈ-అగ్రికల్చర్, డిజిటల్ హెల్త్, ఈ-పేమెంట్స్ వంటి అంశాలపై బిల్ గేట్స్ తన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆధార్, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి అంశాల గురించి నేను గేట్స్‌కు వివరించాను’ అని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.