మంగళగిరి: చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువెనైల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులగొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులో ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి దిన పత్రిక ఆటోను చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వద్ద నిలిపి డ్రైవర్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ.వెయ్యి నగదు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. ఫోన్‌లో సిమ్ తీసేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు. ఇంతలో ఆటో డ్రైవర్‌కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరూ కలిసి వారిని వెంబడించారు.
వీరిని పోలీసులుగా భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనాన్ని అక్కడ వదిలేశారు. అక్కడినుంచి ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపారు. అందులోని ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్టేషన్‌కు తరలించారు. సాక్షి పేపర్ ఆటో డ్రైవర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్‌పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి బాలనేరస్తుల హల్ చల్
Published Wed, Oct 26 2016 8:14 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement