
పదోన్నతుల జాబితాల్లో లోపాలు సరిచేయండి
♦ తెలంగాణ, ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం
♦ వీలైనంత త్వరగా కొత్త జాబితాలు రూపొందించండి
♦ అమల్లో ఉన్న ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పోలీసు అధికారుల పదోన్నతులకు సంబంధించి గత ఏడాది రూపొందించిన జాబితాల్లోని లోటుపాట్లను సరిచేయాల్సిందిగా తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరలో కొత్త జాబితాలను రూపొందించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గందరగోళం మధ్య..
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ హైదరాబాద్ రేంజ్ పరిధిలోనిదా, కాదా అనే వ్యవహారంపై మొదలైన వ్యాజ్యం అనేక మలుపులు తిరిగి రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లతో పాటు ప్రమోటీ డీఎస్పీలు, డెరైక్ట్ డీఎస్పీల పదోన్నతుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో సుదీర్ఘకాలంగా పోలీసు శాఖలో పదోన్నతులు ఇవ్వలేదని, హైదరాబాద్ రేంజ్‌కు సంబంధించి 2009లో ఇచ్చిన ఆదేశాలను ఉన్నతాధికారులు ధిక్కరించారని పేర్కొంటూ గతేడాది సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దాంతో అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు హడావుడిగా పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలు రూపొందించారు. జీవో నం.54, 108లను విడుదల చేసి కొందరికి పదోన్నతులు ఇచ్చేశారు. ఈ జాబితాలను సుప్రీంకోర్టుకు అందజేశారు.
కానీ ఈ పదోన్నతుల జాబితాల రూపకల్పనలో నిబంధనలను పట్టించుకోలేదని, అర్హులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదనపు ఎస్పీగా ఉండాల్సిన వారు ఇంకా ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలుగానే ఉండిపోగా... తమ కంటే జూనియర్లు పదోన్నతి పొందారంటూ పలువురు అధికారులు ఉమ్మడి రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర విభజన తరువాత ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కానీ సుప్రీంకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఇంకా మూసివేయని కారణంగా... జాబితాలను సరిచేయలేమని ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఇదే సమయంలో జీవో నం.54, 108లను సవాల్ చేస్తూ పలువురు అధికారులు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా... ట్రిబ్యునల్ సైతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఏ విధమైన తీర్పు వెలువరించలేమని స్పష్టం చేసింది.
దీంతో ఈ జీవోల్లోని లోపాలను సరిచేసేలా ఆదేశించడంతో పాటు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని కోరుతూ... ఇరు రాష్ట్రాల అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం జరిపిన విచారణకు ఇరు రాష్ట్రాల డీజీపీ లు అనురాగ్‌శర్మ, జేవీ రాముడుతో పాటు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, గత డీఐజీ శశిధర్‌రెడ్డితో పాటు ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, ఏపీ హోం శాఖ మాజీ కార్యదర్శి బి.ప్రసాదరావు, ఉమ్మడి రాష్ట్ర హోం శాఖ మాజీ కార్యదర్శి టీపీ దాస్ హాజరయ్యారు. వారి విజ్ఞప్తి మేరకు ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. దీంతోపాటు పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ పదోన్నతుల జాబితాల్లో లోపాలను సరిచేసి, కొత్త జాబితాలు రూపొందించాలని ఆదేశించింది.
‘సిటీ’ అధికారులకు ప్రయోజనం?
సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నవారికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. 1985లో ఎస్సైలుగా ఎంపికైన అధికారులు 220 మంది వరకు ఉండగా... అందులో దాదాపు సగం మంది హైదరాబాద్ సిటీ పోలీసు విభాగానికే వచ్చారు. పలు కారణాల నేపథ్యంలో గతంలో పోలీసు విభాగంలో వాస్తవ పదోన్నతులు లేవు. ఏటా ప్యానల్ ఇయర్‌లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా తాత్కాలిక పదోన్నతులిస్తూ వచ్చారు. వీటిని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించినదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.54. అయితే 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిటీ పోలీస్‌ను వేరే జోన్‌గా పరిగణించి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా... జోన్-6లో కలిపి ప్రమోషన్లు ఇచ్చా రు. దీంతో నగర కమిషనరేట్‌కు చెందిన పలువురికి అన్యాయం జరిగింది. తాజాగా సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండే (సైబరాబాద్ సహా) అన్ని ఖాళీలను సిటీ కమిషనరేట్‌లోకే చేర్చాల్సి వస్తుందని, ఇది డెరైక్ట్‌తో పాటు ప్రమోటీ డీఎస్పీలకు ఉపయుక్తమని చెబుతున్నారు.