కుమారుడి కోసమే కొత్త సచివాలయం
‘ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఎంతోమంది సీఎంలు పాలించిండ్రు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిండ్రు.
పెద్దపల్లి జిల్లా రైతుధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఫైర్
సాక్షి, పెద్దపల్లి: ‘ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఎంతోమంది సీఎంలు పాలించిండ్రు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిండ్రు. కానీ కొడుకులెవరిని సీఎం లను చేయలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వాస్తు దోషమంటూ ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయానికి వాస్తుదోషం లేదన్నారు. వాస్తుదోషం పేరుతో సీఎం కేసీఆర్ ఉన్న దాన్ని కూల్చివేసి కొడుకు కోసం కొత్త సచివాలయాన్ని కట్టించాలని అనుకుంటున్నాడని విమర్శించారు.
రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్ అని చెబుతున్న సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీ కోసం కేవలం రూ.17 వేల కోట్లు ఒకేసారి కేటారుుంచలేరా? అని ప్రశ్నించారు. భారీ ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేస్తూ వేల కోట్లు కేటారుుస్తున్నారని, అదే రైతుల కోసం రుణమాఫీని ఒకేసారి చేయలేరా? అన్నారు. రాష్ట్రంలో 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేలాది కోట్లను దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త జిల్లాల విభజనను చేపట్టారని, ఇది పూర్తి కావడంతో ప్రజలు ప్రభుత్వ లోపాలను గుర్తించకుండా నియోజకవర్గాల పునర్విభజనను తెరమీదికి తెస్తున్నారని అన్నారు. రుణమాఫీని ఒకేసారి పూర్తిచేయాలని, రైతాం గానికి సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.