తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మాతృమూర్తి అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం ఖమ్మం పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రావు సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఖమ్మం జిల్లా ముదిగొండలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడ్ని అమరవీరుడిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతోపాటు, అతడి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనప్పటికీ రూ.10 లక్షల పరిహారాన్ని అందజేసింది. కాగా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సుధాకర్‌రెడ్డి తల్లి సుగుణమ్మ తన చిన్న కుమారుడు సురేందర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో గురువారం రాష్ట్రావతణ వేడుకల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలోని పోలీసు పరేడు గ్రౌండ్స్ వద్దకు చేరుకుంది. అధికారులను కలసి తన చిన్న కుమారుడికి ఉద్యోగం విషయమై వాకబు చేసింది. జాబితాలో పేరు లేదని వారు చెప్పడంతో అధికారులు పట్టించుకోలేదంటూ మనస్తాపం చెందిన అక్కడే చెట్టు కింద కూర్చుని పరుగుల మందు సేవించింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి... మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ అమరవీరుడి తల్లి ఆత్మహత్యాయత్నం
Published Thu, Jun 2 2016 12:14 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement