తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
Published Thu, Aug 25 2016 11:17 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
ముకరంపుర: ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రతిపక్షాలను భయపెట్టి బ్లాక్‌మెయిల్ పాలన సాగించాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ అన్నారు. గురువారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని విమర్శించారు. కేసీఆర్ తమ్మిడిశెట్టి, మేడిగడ్డ బ్యారేజీల ఎత్తు తగ్గిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎత్తు తగ్గిస్తే అంచనాలు తగ్గాల్సి ఉన్నా వేల కోట్ల రూపాయలు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదివరకే మార్చి 8న, తర్వాత ఆగస్టు 23న రెండుసార్లు మహారాష్ట్ర ఒప్పందంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయహోదా కల్పించడంలో నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేణుమాధవ్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మోకెనపల్లి రాజమ్మ, జిల్లా అధ్యక్షురాలు బోగెపద్మ, నాయకుడు బలాల పాల్గొన్నారు.
Advertisement
Advertisement