తెలంగాణ ప్రజలే మనకు బాసులు
ఖమ్మం: టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే బాసులని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. అధికారం వచ్చిందని ఏనాడు గర్వపడలేదని చెప్పారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక త్యాగాల ఫలితం తెలంగాణ అని అన్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్పై నమ్మకంతో అద్భుత విజయాలు అందించారని చెప్పారు. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘనవిజయం అందించారని గుర్తు చేశారు. మే చివరికల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇస్తామని చెప్పారు. విద్యార్థి సంఘం నాయకులుగా ఉన్నవారికి ఎవరూ ఊహించనివిధంగా అవకాశాలు ఇచ్చామని చెప్పారు. బాల్కా సుమన్ ఎంపీ, బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మేయర్ అయ్యారని పేర్కొన్నారు. అధికారం వచ్చిందని అహం ప్రదర్శించవద్దని, ప్రజలు బండకేసికొడతారని పార్టీ నాయకులను హెచ్చరించారు. కేసీఆర్ ఇంకా మాట్లాడారంటే..
- మేనిఫెస్టోను వందశాతం అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్
- పేదల సంక్షేమానికి 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం
- ఎన్నికల్లో చెప్పకున్నా ఎన్నో మంచి పనులు చేశాం
- బీడీ కార్మికులకు భృతి, విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం
- 2017నాటికి మిషన్ భగీరథ పూర్తి
- పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నాం
- బీసీల సంక్షేమంపై మరింత దృష్టిపెడతాం