తెలంగాణకు రూ.500 కోట్ల ఆదా!
♦ సీజీఎస్ వాటా పెంపు, సంప్రదాయేతర ఇంధనంలో రాష్ట్రానికి వాటాలు
♦ తక్కువ ధరకే రాష్ట్రానికి 250 మెగావాట్ల సీజీఎస్ విద్యుత్
♦ విద్యుత్ వివాదాలపై ఫలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పోరాటం
♦ కేంద్ర న్యాయ శాఖ చేతికి పీపీఏల వివాదం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాటాల విషయంలో ఏపీ ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలపై ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) చైర్మన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివాదాల పరిష్కార కమిటీ ఏపీ, తెలంగాణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి సుమారు రూ.500 కోట్లు ఆదా అయ్యాయి. కేంద్ర విద్యుత్ కేంద్రాల (సీజీఎస్) కరెంటులో రాష్ట్ర వాటాను 53.2 శాతానికి పెంచడంతో అదనంగా 60 మెగావాట్ల విద్యుత్ రానుంది.
అదేవిధంగా అనంతపురం, కర్నూలులోని సంప్రదాయేతర విద్యుత్‌లో రాష్ట్రానికి వాటా కల్పించేందుకు కేంద్రం ఒప్పుకుంది. అయితే, తెలంగాణ వాటా 114 మెగావాట్లను సీజీఎస్ కేంద్రాల నుంచే భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా నిర్మాణంలో ఉన్న సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్లను సైతం పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 250 మెగావాట్ల వరకు సీజీఎస్ విద్యుత్ రానుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌కు రూ.5-6 చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా, సీజీఎస్ (ఎన్టీపీసీ) విద్యుత్ ధరలు మాత్రం రూ.3-3.50 మాత్రమే ఉంటున్నాయి. యూనిట్‌పై రూ.2 వరకు పొదుపు చేస్తూ 250 మెగావాట్లు కొనుగోలు చేస్తే ఏడాదికి రూ.500 కోట్లు ఆదా కానున్నాయి. విద్యుత్ వివాదాలపై తమ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించడం కలిసొచ్చింది.
సీఈఏ కమిటీ సిఫారసులు
సోమవారం జరిగిన సమావేశానికి ముందే సీఈఏ కమిటీ ఓ ముసాయిదా నివేదికను ఇరు రాష్ట్రాలకు పంపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ నివేదికకు తుది మెరుగులు దిద్ది కేంద్రానికి త్వరలో సమర్పించనుంది. ముసాయిదాలోని కీలక అంశాలు ‘సాక్షి’కి ప్రత్యేకం...
విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లకు సంబంధించిన వివాదాన్ని కేంద్ర న్యాయ శాఖకు సిఫారసు చేయనున్నారు. అప్పటివరకు పీపీఏలపై యథాతథ స్థితి కొనసాగించనున్నారు. జీఓ 20 ప్రకారం రెండు రాష్ట్రాలు విద్యుత్ పంపకాలు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏపీ సర్కారు వ్యతిరేకిస్తోంది.
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన ఆస్తుల్లో ఏపీకి 76 శాతం, తెలంగాణకు 24 శాతం వాటా కేటాయిస్తూ గవర్నర్ పాలనలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే రెండు రాష్ట్రాల అవతల ఉన్న మచ్‌ఖండ్, టీబీ డ్యాం ప్రాజెక్టులకు సంబంధించిన ఆస్తులను అప్పట్లో పూర్తిగా ఏపీకి కేటాయించారు. ఈ రెండు వివాదాలను సైతం ఆస్తులు, అప్పుల వివాదాల పరిష్కార కమిటీకి అప్పగించనున్నారు.