కేవీసీ రామచంద్రరావు (ఫైల్ ఫొటో)
సాక్షి, ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడూ చిన్నచూపేనని, ఆంధ్ర ప్రజల సమస్యలను నెరవేర్చడంలో కేంద్రానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా పోలవరంపై తాను అడిగిన నాలుగు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం ఖర్చు భరిస్తానని చెప్పి పీపీఏ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వంచించడానికి నడుముకట్టుకుందని వ్యాఖ్యానించారు. పీపీఏ కాదని అర్థరాత్రి ప్రాజెక్టు నిర్వహణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నారని ఆరోపించారు. పోలవరం ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
స్వప్రయోజనాల కోసం, సొంత లాభం కోసం కేంద్రం సహకరించదని చంద్రబాబు గ్రహించిన తర్వాతే క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారని ఆయన విమర్శించారు. దుగ్గిరాజ పట్నం పోర్టుకు సంబంధించి ఊసే లేదని, కేంద్ర హోంశాఖ నిస్సంకోచంగా, నిర్లక్ష్యంగా, ఏపీకి రైల్వే జోన్ లేదని చెప్పటం హాస్యాస్పదమన్నారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment