సాక్షి, అమరావతి: భార్యాభర్తల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వం, మరొకరు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. భర్త లేదా భార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే.. రెండో వ్యక్తికి తెలుగు రాష్ట్రాల మధ్య డిప్యుటేషన్‌కు అనుమతించాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు దినేశ్‌కుమార్, ఎస్.పి. సింగ్ సంయుక్తంగా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే భార్య, భర్తల విషయంలో మాత్రమే అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం ఉంది.
కానీ, ఒకరు కేంద్ర ప్రభుత్వం, మరొకరు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే భార్యాభర్తలకు ఈ వెసులుబాటు లేదు. దీంతో తమకూ అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించాలంటూ వీరి నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో వీరికి ఊరట కలిగిస్తూ రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉదాహరణకు.. భర్త తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ లేదా బ్యాంకు ఉద్యోగిగా ఉండి.. భార్య ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఆమె (భార్య)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై పంపిస్తుంది.
అలాగే భార్య ఏపీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా లేదా బ్యాంకులో పనిచేస్తుంటే.. భర్త తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తుంటే భర్తను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై పంపిస్తుంది. తొలుత మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై పంపిస్తారు. అనంతరం రెండేళ్లు పొడిగిస్తారు. అయితే, డిప్యుటేషన్ కోరుకునే ఉద్యోగులపై ఎటువంటి కేసులు ఉండరాదని, టీఏ, డీఏలు వర్తించవని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. అలాగే, డిప్యుటేషన్ కోరిన చోట ఖాళీ ఉండాల్సి ఉంది.
Published Sat, Oct 7 2017 1:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment