‘సంక్షేమ’ శాఖలో..డిప్యుటేషన్ల షాక్!
సాక్షి, హైదరాబాద్: ‘‘జిల్లా సంక్షేమ కార్యాలయాల బలోపేతం కోసం మిమ్మల్ని బదిలీ చేస్తున్నాం. ఇకపై డిప్యుటేషన్ల పద్దతిలో మీరంతా డీడబ్ల్యూఓ కార్యాలయాల్లో పని చేయండి. వెంటనే అక్కడ విధుల్లో చేరండి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్కడే కొనసాగండి ఇదీ మహిశాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులకు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఆ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ‘న్యూ ఇయర్ షాక్’.క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యను అధిగమించేందుకు సర్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 109 మంది సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్‌లతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆ శాఖ స్థానచలనంకలిగించింది. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగా... ఉద్యోగులకు అకస్మాత్తుగా డిప్యుటేషన్లు ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు.
ఎలాంటి సమాచారం లేకుండా... వ్యక్తిగత స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా వేరేచోట విధులు నిర్వహించాలని ఆదేశించడంపై భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా ప్రస్తుతం ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా పని ఒత్తిడి తగ్గిన నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మినిస్టీరియల్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈమేరకు చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు గడచిన డిసెంబర్ 30వ తేదీన మెమో జారీ చేసింది. వెంటనే రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పందిస్తూ డిప్యుటేషన్లు ఇస్తే సంబంధిత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో హైదరాబాద్ ఆర్జేడీ పరిధిలో 43 మంది, వరంగల్ ఆర్జేడీ పరిధిలో 66 మంది ఉన్నారు. జిల్లా పరిధిలోనే డిప్యూటేషన్ ఇవ్వాల్సి ఉండగా... కొంతమందికి అంతర్జిల్లాకు కూడా ఇచ్చారు.
ఆ ఉద్యోగుల్లో అ‘సమ్మతి’...
డిప్యుటేషన్ ఉత్తర్వులు అందడంతో మెజార్టీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కనీస సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగుల నుంచి సమ్మతి తీసుకోకుండా ఎలా ఇస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సూచించినట్లుగా ఉద్యోగులతో మాట్లాడాలని, వారి నుంచి సమ్మతి పత్రాలు తీసుకున్న తర్వాతే డిప్యుటేషన్ ఇవ్వాలి. అవేమీ లేకుండానే జిల్లా కార్యాలయాల్లో పనిచేయాలని ఆదేశించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియార్టీని పట్టించుకోకుండా, కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఇష్టానుసారంగా స్థానచలనం కలిగించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, కుటుంబాన్ని తరలిస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు వస్తాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఎన్నికల విధుల్లో ఉండాల్సిన కొందరు ఉద్యోగులకూ డిప్యుటేషన్ ఇచ్చినట్లు సమాచారం. తక్షణాదేశాలు కావడంతో మెజార్టీ ఉద్యోగులు అయిష్టంగానే విధుల్లో చేరారు.