సాక్షి, అమరావతి/పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం నిఘాను తీవ్రతరం చేసింది. రెండు నెలల్లో ఆరుసార్లు పోలవరం పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం పనుల పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. వ్యాప్కోస్‌కు అప్పగించారు. వ్యాప్కోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎన్‌ఎన్ ప్రసాద్ నేతృత్వంలో ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్‌వీఎన్ రావు, సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ వీఎస్‌ఎన్ రాజులు సభ్యులుగా పనుల పర్యవేక్షణకు ఆ సంస్థ త్రిసభ్య కమిటీని నియమించింది. మొదటిసారిగా బుధవారం వ్యాప్కోస్ కమిటీ పోలవరం పనులను పరిశీలించింది. అధికారులతో సమావేశమై పనులు సాగుతోన్న తీరును సమీక్షించింది. ప్రతి 15 రోజులకు పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుంది.
ఇక పీపీఏ చెప్పిందే వేదం
పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని భరించి.. వేగంగా పూర్తి చేయడానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ 7, 2016న పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం అప్పగించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచేసింది. పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీ కమీషన్‌లు దండుకుంటోన్న వైనంపై ఫిర్యాదు అందడంతో కేంద్రం అప్రమత్తమైంది.
పీపీఏ కార్యాలయాన్ని తక్షణమే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని గడ్కరీ ఆదేశించారు. ఇటీవల అనుమతి లేకుండా రూ.1483.23 కోట్ల విలువైన పనులకు రాష్ట్ర సర్కార్ టెండర్లు పిలవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఇకపై కొత్తగా టెండర్లు పిలవాలన్నా, పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నా.. బిల్లులు చెల్లించాలన్నా పీపీఏ అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఎగువన నిర్మించే కాఫర్ డ్యామ్ డిజైన్‌లపై శుక్రవారంలోగా ఎన్‌హెచ్‌పీసీ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ప్రాజెక్టు పనులను నెలకు ఒకసారైనా తానే క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని గడ్కరీ నిర్ణయించారు. కాగా, పనులు జరుగుతున్న తీరుపై వ్యాప్కోస్ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment