కోరలు చాస్తున్న కేన్సర్
- తెలుగు రాష్ట్రాల్లో విజృంభణ
- 2016లో 90 వేల కొత్త కేసులు
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్ రక్కసి విజృంభిస్తోంది. ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుండటం అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దేశంలో ఏటా 10 లక్షల మంది కొత్త కేన్సర్ బాధితులు నమోదవుతుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి లక్ష మందికి దాదాపు వంద మంది కేన్సర్ బారిన పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక కేన్సర్ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లో మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్‌కు గురవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్) కేన్సర్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆస్పత్రులు తగినన్ని లేకపోవడం, వైద్యం ఖరీదు కావడంతో కుటుంబాలు ఈ వ్యాధి బారిన పడిన వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
కేన్సర్‌కు ప్రధాన కారణాలు
► స్థూలకాయం కడుపులో వచ్చే కేన్సర్‌లకు కారణమవుతోంది
► పొగాకు, చుట్ట వంటి వాటివల్ల ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు
► పొగ తాగడం వల్ల 20 రకాల కేన్సర్‌లకు గురవుతున్నట్టు తేలింది
► మద్యం సేవించే వారిలో ఎక్కువగా కాలేయ కేన్సర్‌లకు గురవుతున్నారు
► జీవనశైలి, ఆహార పదార్థాల వల్ల రొమ్ము కేన్సర్‌లు వస్తున్నాయి
నివారణకు దోహదం చేసే అవకాశాలు
► రోజూ తాజా పళ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల పలు రకాల కేన్సర్‌లను నివారించే అవకాశం ఉంది
► ప్రాసెస్డ్ ఫుడ్ (నిల్వ ఆహారాన్ని) తినకపోవడం వల్ల కూడా కొన్ని కేన్సర్‌లను నియంత్రించవచ్చు
► రోజూ వ్యాయామం చేయడం వల్ల స్థూలకాయాన్ని నివారించవచ్చు. దీనివల్ల కేన్సర్‌లను నివారించుకునే అవకాశం ఉంటుంది.
వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వాలి
తెలుగు రాష్ట్రాల్లో ఏటా 90 వేల కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మహిళల్లో ఈ వ్యాధిని నివారించా లంటే 15 ఏళ్లలోపు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయాలి. ప్రభుత్వాలే వీటిని ఉచితంగా సరఫరా చేస్తే మంచిది.
– డా‘‘ రమేశ్ మాటూరి, కేన్సర్ నిపుణులు, ఎంఎన్‌జే
మహిళలందరికీ హెల్త్ చెకప్
ఏపీ ప్రభుత్వం 35 ఏళ్లు దాటిన మహిళ లకు మాస్టర్ హెల్త్ చెకప్ ప్రవేశ పెట్టింది. ఇందులో ఉన్న పాప్ స్మియర్, మామోగ్రాం టెస్టుల ద్వారా కేన్సర్ నిర్ధారించు కోవచ్చు.
– డా‘‘ సుబ్బారావు, వైద్యవిద్యా డైరెక్టర్, ఏపీ