♦ తరలిపోయిన అల్పపీడనం
♦ అరేబియా సముద్రంలో తుపాను
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరిం త బలపడనుంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. శనివారం రాత్రికి గోవాకు పశ్చిమ నైరుతి దిశలో 490 కిలోమీటర్ల దూరంలోనూ, ముంబైకి దక్షిణ నైరుతి దిశలో 560 కిలోమీటర్ల దూరంలోనూ ఇది కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 12 నుంచి బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘చపల’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది.
అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. గతేడాది ఉత్తర కోస్తాను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపాను అక్టోబర్ పదో తేదీనే తీవ్ర రూపం దాల్చింది. కాకతాళీయంగా ఇప్పుడు అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడుతోంది. తుపాను వార్త నేపథ్యంలో మునుపటి హుద్‌హుద్ విలయం నేపథ్యంలో కొందరిలో ఆందోళన రేకెత్తింది. కానీ గుజరాత్, ముంబై, గోవాలపై మాత్రమే తుపాను మోస్తరు ప్రభావం చూపుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు తప్పిన తుపాను ముప్పు
Published Sun, Oct 11 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM
Advertisement