సీఎం వస్తున్నారని.. | temple officials unhurried for cm coming badrachalam srisitaramula kalyanam | Sakshi
Sakshi News home page

సీఎం వస్తున్నారని..

Published Wed, Apr 13 2016 4:18 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సీఎం వస్తున్నారని.. - Sakshi

సీఎం వస్తున్నారని..

జిల్లా యంత్రాంగమంతా హడావుడి
గత పర్యటనలో ఇచ్చిన హామీలపై కసరత్తు
నివేదికల తయారీలో అధికారుల తలమునకలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: భద్రాచలంలో జరిగే  శ్రీసీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుండటంతో జిల్లా అధికారులంతా అలర్ట్ అయ్యారు. గత నవమికి వచ్చినప్పుడు సీఎం ఇచ్చిన హామీలు, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం నగరంలో పర్యటించినప్పుడు చేసిన వాగ్దానాలు ఎంత వరకు వచ్చాయో  పరిశీలించే అవకాశముంది. దీంతో  సంబంధిత అధికారులంతా నివేదికలతో కుస్తీ పడుతున్నారు. గత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఖమ్మం నగరంలోని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో తిరిగినప్పుడు ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. అయితే భద్రాచలంలో సీతారామ కల్యాణానికి  ఈనెల 15న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఆ హామీల అమలు ఎంతవరకు వచ్చిందనే దానిపై అధికారులు నివేదికలు తయారు చేసేందుకు హడావుడి చేస్తున్నారు.

భద్రాచలం అభివృద్ధిపై కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా కూడా అధికారులు సమాయత్తమవుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల ముందు  ఖమ్మం నగరంలో పర్యటించడంతోపాటు.. అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా సమస్యలను అవగాహన చేసుకుని.. వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. దీనిపై అధికారులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.  గత ఏడాది శ్రీరామనవమికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి... ఈసారి వచ్చినప్పుడు భద్రాచలం అభివృద్ధిపై మాట్లాడతానని చెప్పారు. దీంతో భద్రాచలం దేవస్థానం, పట్టణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 సీఎం హామీలపై..
ఖమ్మంలో పర్యటించిన సందర్భంగా సీఎం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు పలు హామీలు గుప్పించారు. వీటిలో చాలా హామీలకు ముందడుగు పడలేదు. ఖమ్మంకు 3వేల డబుల్ బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తున్నామని, ఖమ్మంలో ఆస్తిపన్నుపై వడ్డీని మాఫీ చేస్తామని,  నగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేస్తామని, డిసెంబర్ నెల తర్వాత ఖమ్మంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తామని, హైదరాబాద్, వరంగల్ మాదిరిగానే ఖమ్మంలో కూడా జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని, భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన నాలుగు గ్రామపంచాయతీలను మళ్లీ తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకుంటామని,  భద్రాచలం ప్రధాన పుణ్యక్షేత్రమని, వేములవాడ, యాదాద్రి తరహాలో దీన్ని అభివృద్ధిచేస్తామన్నారు.

సింగరేణి గనులకు నెలవైన కొత్తగూడెంలో మైనింగ్ కళాశాల లేదా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం నగరంలో హమాలీలు, గ్రానైట్ కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరికి ఇళ్లు కట్టించడానికి ఖమ్మం నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందన్నారు. రమణగుట్ట, శ్రీనివాసనగర్, శుక్రవారపేట, బురదరాఘవాపురంలో ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. గోళ్లపాడు చానల్ మురుగుతో దోమలు, దుర్వాసనతో వారు కాలం వెళ్లదీస్తున్నారని, వీరికి ఇళ్లస్థలాలు చూసి ఇళ్లు కట్టించి అక్కడినుంచి తరలిస్తామన్నారు. ఆ తర్వాత గోళ్లపాడు చానల్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ పనులన్నింటిపైన అధికారులు ఇప్పటికే పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈసారి ప్రత్యేకంగా భద్రాచలం వరకే పరిమితం అవుతుండటంతో భద్రాచలం పట్టణాభివృద్ధితోపాటు దేవాలయ అభివృద్ధికి ఏ హామీలు ఇస్తారోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement