పనిచేద్దామని వస్తే.. ఇన్ని కష్టాలా? | Temporary secretariat employees problems | Sakshi
Sakshi News home page

పనిచేద్దామని వస్తే.. ఇన్ని కష్టాలా?

Published Wed, Oct 5 2016 4:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

పనిచేద్దామని వస్తే.. ఇన్ని కష్టాలా?

పనిచేద్దామని వస్తే.. ఇన్ని కష్టాలా?

 * తాత్కాలిక సచివాలయంలో విధులు లేవు.. వెతలే!
 * ఇద్దరు కలిస్తే సమస్యలపైనే చర్చ 
 ఫోన్లలో ఇక్కట్ల జర్నీ గురించి ఏకరువు
 వసతి, ప్రయాణం, భోజనం అన్నీ బాదుడే
 ఆవేదనలో ఉద్యోగులు
 
సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు ఇక్కడ సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నో సమస్యలున్నా సర్దుకుని మరీ ఇష్టంగా చేసేందుకు వచ్చినా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. సర్కారు వైఫల్యాలతో తలదాచుకోవడం దగ్గర్నుంచి ప్రయాణం, కూర్చోవడానికి చాంబర్, సీటు, భోజనం, మరుగుదొడ్డి ఇలా అన్ని విషయాల్లోనూ వారి ఇక్కట్లు వర్ణనాతీతం. విధులు చేసేందుకు కూడా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కార్యాలయంలో భోజన విరామం, ప్రయాణ సమయాల్లో సహా ఎక్కడ ఇద్దరు ఉద్యోగులు కలిసినా తమ ఇబ్బందులను వెళ్లబోసుకుంటున్నారు. కలిసి ఉన్న ఉద్యోగులు తమ ఇబ్బందులు పరస్పరం చెప్పుకొంటుంటే హైదరాబాద్‌లోని తమ వారికి ఫోన్లు చేసి తమ కష్టాల జర్నీ గురించి చెప్పుకోవడం గమనార్హం. ఇక్కడ అన్ని ఏర్పాట్లూ చేశామని, కచ్చితంగా వచ్చి పనిచేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన మాటలు నమ్మి వచ్చి అవస్థలు పడుతున్నామని పలువురు ఉద్యోగులు తమ వారికి వివరిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన దగ్గర్నుంచి వెలగపూడి సచివాలయానికి చేరుకునే వరకు తమ జర్నీ అంతా అవస్థలమయమేనని వాపోతున్నారు.
 
చుక్కలు చూపుతున్న ఇంటి అద్దెలు...
సచివాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం రెయిన్‌ట్రీ పార్కులో వసతి కల్పించింది. పురుషులకు ఇళ్లు వెదుక్కోవడం ఇబ్బందికరంగా మారింది. రాజధాని ప్రాంతంలో అద్దెలు చుక్కలను చూపిస్తున్నాయి. అందులోను బ్యాచిలర్స్‌కు అద్దెకు ఇచ్చేది లేదని తెగేసి చెబుతుండటంతో మరీ ఇబ్బందికరంగా మారింది. పిల్లల చదువులు, అయినవారి ఉద్యోగాలను వదిలి ఫ్యామిలీని హైదరాబాద్‌ నుంచి తీసుకురావటం ఇబ్బందికరం కావటంతో కొందరు ఒంటరిగానే ఇక్కడికి వచ్చారు. అలాగని పెళ్లైన బ్యాచిలర్‌లకు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇళ్లు దొరికే పరిస్థితి లేదు. ఇళ్లు దొరకక మిత్రుని ఇంట్లో తలదాచుకున్నానని ఒకరు, బంధువుల ఇంటికి వెళ్లానని మరొకరు, బస్టాండ్‌ డార్మెట్రీలో పడుకున్నానని మరొకరు తలదాచుకోవడానికి పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. వసతి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 
ఖర్చులు తడిసిమోపెడు...
విధి నిర్వహణకు వెళ్లాలంటే విజయవాడ నుంచి బస్సుకు వెళ్లేందుకు రూ.23, వచ్చేందుకు రూ.23 చార్జీల మోత తప్పడంలేదు. అదే గుంటూరు నుంచి వచ్చి పోయేందుకు రూ.60కి పైమాటే. భోజనానికి రూ.50 నుంచి రూ.70 ఖర్చుపెట్టాల్సిందే. ఇలా రోజువారీ ప్రయాణ, భోజన, వసతి ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులను తలుచుకుని ఉద్యోగులు గుండెలు బాదుకుంటున్నారు. తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెడితే వారి విధులు కష్టంతో కాకుండా ఇష్టంతో చేసే పరిస్థితి ఉంటుందని పలువురు చెబుతున్నారు.
 
సీఎం దృష్టికి మహిళా ఉద్యోగుల సమస్యలు
– రాజకుమారి హామీ
తక్కువ సమయంలోనే సచివాలయాన్ని నిర్మించి ఇక్కడ విధులకు ఉద్యోగులను తీసుకురావడంతో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మహిళా ఉద్యోగులకు మంగళవారం పండ్లు, కనకదుర్గమ్మ కుంకుమ, లలితా సహస్రనామం పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల సమస్యతో తాము పడుతున్న ఇబ్బందులను పలువురు మహిళా ఉద్యోగులు రాజకుమారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలకు ఒకేచోట మరుగుదొడ్లు ఉండటం, అవీ తగినన్ని లేకపోవడం, ఫ్యాన్లు, ఏసీలు సరిగ్గా లేకపోవడం తదితర సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉదయం సచివాలయానికి వచ్చి రాత్రి ఇంటికి వెళ్లే ఉద్యోగులు కనీసం కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరకులు కొనుగోలు చేసుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి ఉందని చెప్పారు. వారి కోసం సచివాలయ ప్రాంతంలోనే రైతు బజార్, సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేయాలని సీఎంను కోరతానని అన్నారు. లేకుంటే వారం రోజుల్లో తానే ఏర్పాటు చేస్తానని రాజకుమారి వెల్లడించారు. 
 
పోలీసుల పడిగాపులు..
సచివాలయంలో ఉద్యోగులు విధులకు తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా కానిస్టేబుళ్లను సచివాలయ ప్రాంతానికి విధులకు తరలించారు. విజయవాడ, గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయం చేరుకునే దారి పొడవునా పోలీసులు గస్తీ కాశారు. వెలగపూడి సచివాలయ ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సచివాలయ ప్రాంతంలో తాత్కాలిక గుడారాలు వేసుకున్న పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. మండే ఎండలోను, దుమ్ము, ధూళిలోను పోలీసులకు పడిగాపులు తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement