లోకేశ్వరం: ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గ్రామానికి చెందిన సింధే పంకట్ పటేల్(26) ఆదివారం హత్యకు గురయ్యాడు. అతడి హత్యకు కారణమయ్యారంటూ గ్రామంలోని ఇద్దరి ఇళ్లపై పంకజ్ బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు ఇళ్లతో పాటు రెండు బైకులు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల పై మహిళలు దాడికి దిగారు. దీంతో పుస్పూర్ లో భారీగా పోలీసులను మొహరించారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు సహా 30 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు.
కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పంకజ్.. గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాల్లో స్థానిక సర్పంచ్ భర్త రాజేశ్ బాబుతో అతడికి విభేదాలున్నాయి. తనకు సన్నిహితుడైన బుల్లోల రాజన్నతో పంకజ్ ను రాజేశ్ బాబు హత్య చేయించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆదివారం రాత్రి చలి మంట కాచుకుంటున్న సమయంలో రాజన్న అకస్మాత్తుగా వచ్చి పంకజ్ పై కత్తితో దాడి చేశాడు. భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పంకజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుస్పూర్ లో ఉద్రిక్తత
Published Tue, Jan 26 2016 3:34 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement