Lokeshwaram
-
పెళ్లి.. భర్తతో విడాకులు.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయి
సాక్షి, ఆదిలాబాద్: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం... లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన నరేష్, ఓ యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కాగా, నరేష్ సైతం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సదరు యువతి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. నరేష్‌తో వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకుంది. మళ్లీ ఇరువురు లోకేశ్వరం చేరుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి సదరు యువతి నరేష్ ఇంటికి వెళ్లింది. దీంతో నరేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. బాధితురాలు అక్కడే మౌనపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధిచెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. చదవండి: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే! -
పంట కాపలాకు వెళ్లి పాలేరు మృతి
లోకేశ్వరం(ముథోల్): లోకేశ్వరం మండలం కన్కపూర్ గ్రామ శివారు ప్రాంతంలో లక్ష్మినగర్‌తండాకు చెందిన పాలేరు మూడ రాము(35) గురువారం మృతి చెందాడు. లక్ష్మినగర్ తండాకు చెందిన మూడ రాము ఆష్టా గ్రామానికి చెందిన సాయారెడ్డి వద్ద పాలేరుగా ఉంటున్నాడు. శనగ పంటను అడవి పందుల నుంచి రక్షించడానికి రాము కాపలాకు వెళ్లి గురువారం చేనులో రాము శవమై కనించాడు. మృతదేహాన్ని ముథోల్ సీఐ రఘుపతి పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. రాము తండ్రి లచ్చిరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కారు బోల్తా: ముగ్గురికి గాయాలు
లోకేశ్వరం(ముథోల్): మండలంలోని పుస్పూర్ గ్రామ శివారు ప్రాంతంలో శు«క్రవారం కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయని ఎస్సై రమేశ్ తెలిపారు. భైంసా మండలం దేగాం నుంచి లోకేశ్వరంకు శుభకార్యం కోసం కారులో బయాలు దేరారు. పుస్పూర్ గ్రామ శివారు ప్రాంతంలోని మూలమలుపు వద్ద అతివేగంగా కారును నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన సుష్మ, రక్షిత్‌తో పాటు డ్రైవర్ రాజేంద్రప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు వెంటనే భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పుస్పూర్ లో ఉద్రిక్తత
లోకేశ్వరం: ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గ్రామానికి చెందిన సింధే పంకట్ పటేల్(26) ఆదివారం హత్యకు గురయ్యాడు. అతడి హత్యకు కారణమయ్యారంటూ గ్రామంలోని ఇద్దరి ఇళ్లపై పంకజ్ బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు ఇళ్లతో పాటు రెండు బైకులు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల పై మహిళలు దాడికి దిగారు. దీంతో పుస్పూర్ లో భారీగా పోలీసులను మొహరించారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు సహా 30 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పంకజ్.. గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాల్లో స్థానిక సర్పంచ్ భర్త రాజేశ్ బాబుతో అతడికి విభేదాలున్నాయి. తనకు సన్నిహితుడైన బుల్లోల రాజన్నతో పంకజ్ ను రాజేశ్ బాబు హత్య చేయించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆదివారం రాత్రి చలి మంట కాచుకుంటున్న సమయంలో రాజన్న అకస్మాత్తుగా వచ్చి పంకజ్ పై కత్తితో దాడి చేశాడు. భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పంకజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మాట వినలేదని తమ్ముడిని చంపిన అన్న
లోకేశ్వరం (ఆదిలాబాద్) : చెప్పిన మాట వినలేదనే కోపంతో ఓ అన్న.. తమ్ముడి చావుకు కారణమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవిదాస్ బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. తమ్ముడు ముత్యం(35)కు ఓ పని పురమాయించాడు. నిరాకరించటంతో అతడి ఛాతీపై కాలితో బలంగా తన్నాడు. దీంతో ముత్యం అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రాములు గురువారం ఉదయం పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. -
పింఛన్ల తొలగింపుపై ఆందోళన
లోకేశ్వరం : అర్హులకు ఆసరా పథకంలో పింఛన్లు మంజూరుకాకపోవడంతో ఆందోళన బాటపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పింఛన్లను తొలగించడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామానికి చెందిన వితంతులు, వృద్ధులు, వికలాంగులు శనివారం లోకేశ్వరం పాత బస్టాండ్ ఏరియాలో మూడు గంటల పాటు రోడ్డుపై బైటాయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్‌డౌన్ నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు. దీంతో లోకేశ్వరం నుంచి నిర్మల్, భైంసా పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అర్హులందరికీ పింఛన్లు ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆందోళనకారులు డెప్యూటీ తహశీల్దార్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయపూర్‌కాండ్లీ సర్పంచ్ రాధిక సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, నాయకులు భీంరావు, నాలం గంగయ్య, ఆనందం, సాయి, నందకేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. మందమర్రిలో మండలంలో.. మందమర్రి : అర్హుల పింఛన్లను తొలగించడాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు శనివారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు మాట్లాడుతూ వివిధ సర్వేల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అర్హుల పింఛన్లలో కోత పెట్టిందన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 4,800 మందికి పింఛన్లు వస్తుండగా ప్రస్తుతం వాటిని 2100 కుదించారని తెలిపారు. గతంలో పింఛన్లు పొందిన వికలాంగుల పేర్లు సైతం జాబితా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన పాలకులు ఆచరణలో చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు. గంట పాటు రాస్తారోకో.. పింఛన్ల తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై సైతం రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఒక దశలో ఆయా పార్టీల నాయకులు, పింఛన్లు రాని బాధితులు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి యత్నించారు. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరంలోనికి వెళ్లిన నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొత్కు సుదర్శన్, సట్ల రవీందర్, సంగి సంతోష్, తుమ్మ శ్రీశైలం, నోముల ఉపేందర్‌గౌడ్, టీడీపీ నాయకులు పైడిమల్ల నర్సింగ్, హన్మంతు, సది తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు!
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ముథోల్ అభ్యర్థి వేణుగోపాలచారిపై లోకేశ్వరం పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన వేణుగోపాలచారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి10 గంటల తర్వాత కూడా బహిరంగసభ నిర్వహించారు. ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా 10 గంటల తర్వాత లోకేశ్వరం బహిరంగసభలో ప్రసంగించడంతో వేణుగోపాలచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.