కోనసీమలో టెన్షన్‌.. టెన్షన్‌! | Tension Tension in konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమలో టెన్షన్‌.. టెన్షన్‌!

Published Mon, Jun 6 2016 10:24 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

ఫైల్ ఫోటో - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షిప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వం అన్నంత పనిచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేసులతో భయాందోళనలకు గురిచేసి కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. మంజునాథ్‌ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గరపడుతున్న క్రమంలో కాపుల రిజర్వేషన్ అంశంపై సర్కార్ స్పందించకుంటే సెప్టెంబరు నుంచి మలివిడత ఆందోళనకు సిద్ధమని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈ ఏడాది జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై సుమారు 350 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం పెద్ద ఎత్తున పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో  కాపు ఉద్యమంతో సంబంధం లేని వారు, కాపేతరులు కూడా ఉన్నారు. కోనసీమలో సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం పెద్ద ఎత్తున అరెస్టులు చేయాలనే తలంపుతో భారీగా పోలీసులు మోహరించారు. అమలాపురంలో 14 చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ఏఎన్‌ఎస్ టీంలో ఉన్న వారందరికీ ట్యాబ్‌లు అందజేశారు. మొదటి విడతగా క్షేత్రస్థాయిలో ఉన్న కాపు యువతను అరెస్టుచేసి రెండో విడతలో తుని సంఘటన రోజు ఉద్యమానికి పలు ప్రాంతాల్లో నాయకత్వం వహించిన నేతలను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. తొలి విడతగా అమలాపురంలో సోమవారం దూడల ఫణితోపాటు 10 మంది కాపు యువకులను రావులపాలెం, కొత్తపేట తదితర పోలీసు స్టేషన్లకు తీసుకుపోయారు. వారిలో కొందరిని సీబీసీఐడీ పోలీసులు విచారించి విడిచిపెట్టగా మరికొంత మంది పోలీసుల అదుపులోనే ఉన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ నేతలపైనా...
తుని నియోజకవర్గంలో కాపు ఉద్యమానికి సంబంధం లేని బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారు. వారిద్దరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు. కోటనందూరు మండలం బిళ్లనందూరు గ్రామ సర్పంచి లగుడు ఆదిలక్ష్మి భర్త, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు లగుడు శ్రీను, తొండంగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పార్టీ నేత పెండ్యాల రామకష్ణను పోలీసులు తునిలో అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంత పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇప్పుడే పంపించేస్తామని చెప్పి వారిని తీసుకుపోయారని, ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియడంలేదని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఉద్యమంతో సంబంధం లేకున్నా కేవలం వైఎస్‌ఆర్‌సీపీలో క్రియాశీలకంగా ఉన్నారనే కారణంతోనే తమవారిని తీసుకుపోయారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుని ఘటన జరిగిన రోజు అక్కడి అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న బీసీలతోపాటు ఎస్సీలపై కూడా కేసులు నమోదుచేయించారు.

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న కాపు ఉద్యమం వెనుక వైఎస్‌ఆర్‌సీపీ ఉందని మఖ్యమంత్రి, మంత్రులు ముందస్తు వ్యూహంతో చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మించేందుకే ఆ పార్టీ నేతలను ఇరికిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. సీబీసీఐడీ, సివిల్ పోలీసులు వారిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుని నుంచి కోనసీమ కేంద్రం అమలాపురం వరకు పలువురుని అదుపులోకి తీసుకుని పోలీసులు భయాందోళనలు సృష్టిస్తున్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వే
వేధింపుల పర్వానికి తెరతీయడం.. కాపుఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన యువతను కటకటాల వెనక్కునెట్టేందుకు రంగం సిద్ధం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement