టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ఫెయిలయ్యానన్న మనస్తాపం
విషం తాగడంతో మృతి
పార్వతీపురం: పదో తరగతి ఫెయిల్ కావడంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం ఏరియా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలివి. కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామానికి చెందిన కొర్లాపు ప్రియాంక (15) మంగళవారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో లెక్కలు ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం విషం తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందింది.
స్కూల్ టాపర్
స్కూల్ టాపరైన ప్రియాంకకు అన్ని సబ్జెక్టుల్లో 9 పాయింట్లు వచ్చినా, లెక్కల్లో ఫెయిలైందని మృతురాలి అన్నయ్య కొర్లాపు లక్ష్మణరావు తెలిపాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మగతగా ఉందని, పడుకుంటానని చెప్పి కుప్పకూలిపోయిందన్నాడు. వెంటనే గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లి, పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని తెలిపాడు. విషం ఎందుకు తీసుకుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
విలపించిన కుటుంబ సభ్యులు
మృతురాలి తండ్రి తవిటన్నదొర, అన్నయ్య లక్ష్మణరావులిద్దరూ జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సోదరి ప్రమీల ఉంది. తల్లి మహాలక్ష్మి కూలి పనులు చేస్తోంది. ప్రియాంక ఆత్మహత్యతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి ప్రాంతమంతా విషాదం అలముకుంది. ప్రియాంకను ఆసుపత్రికి తెచ్చేసరికే నోటి వెంట నురగలొచ్చాయని ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వెంకటరావు తెలిపారు. విషం తాగినప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, చికిత్స చేస్తుండగా మృతి చెందిందని తెలిపారు. అప్పటికే బాగా ఆలస్యమైందని స్పష్టం చేశారు.