పోలవరంలో ఉద్రిక్తత
పోలవరంలో ఉద్రిక్తత
Published Sat, Jan 7 2017 10:28 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
ప్రాజెక్ట్ ప్రాంతంలోకి దూసుకెళ్లిన నిర్వాసితులు
రోడ్డుపై బైఠాయింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్ :
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు రోడ్డెక్కారు. తమను దౌర్జన్యంగా గ్రామాల నుంచి ఖాళీ చేయించి ఇప్పటివరకూ నష్టపరిహారం చెల్లించలేదంటూ ఆందోళనకు దిగారు. నిర్వాసితుల సంఘం నేతృత్వంలో శనివారం సాయంత్రం ప్రాజెక్ట్ పనులను అడ్డుకునేందుకు నిర్వాసితులంతా ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి ర్యాలీగా బయలుదేరారు. వారిని మధ్యలోనే పోలీసుల అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులంతా అక్కడే బైఠాయించారు. వందలాది మహిళలు, వృద్ధులు, పిల్లలు తరలిరాగా.. పోలీసులు పెద్దఎత్తున మోహరించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి 9 గంటల వరకూ నిర్వాసితులో చలిలోనే అక్కడ ఉన్నారు. ఒక దశలో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్వాసితులు అడ్డుకోవడంతో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న శనివారం రాత్రి 8 గంటల సమయంలో హుటాహుటిన ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకుని నిర్వాసితులతో చర్చలు జరిపారు. నిర్ధిష్టమైన హామీలు ఇచ్చి, నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఆందోళనను విరమించేది లేదని నిర్వాసితులు స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన అన్ని శాఖల అధికారులతో పునరావాస కేంద్రాలకు వచ్చి నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని ఆర్డీవో లవన్న హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు శాంతించలేదు. భూమికి భూమి ఇవ్వాలని, భూమి అభివృద్ధి పనులు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని తదితర డిమాండ్లను ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. అర్హత ఉన్నవారందరికీ డేటా ప్రకారం ప్యాకేజీ అమలు చేశామని, 112 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.2.83 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదనలు పంపించామని ఆర్డీవో వివరించారు. ఈనెల 12వ తేదీ నాటికి సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని నిర్వాసితులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం
ప్రాజెక్ట్ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ నిర్వాసితులను అత్యంత దౌర్జన్యంగా గ్రామాల నుంచి ఖాళీ చేయించి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సమగ్ర నష్టపరిహారం అందించేంత వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అపివేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 8 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 6 గ్రామాలు నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించి గాలికి వదిలివేశారని విమర్శించారు. ఇప్పటివరకు ఈ 13 గ్రామాలకు పూర్తిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదని, 400 గ్రామాల నిర్వాసితులకు ఎప్పటికి పూర్తిచేస్తారని ప్రశ్నించారు. 2018 నాటికి ముఖ్యమంత్రి పోలవరం పూర్తిచేస్తానని ఆర్భాటంగా చెబుతున్నారని, వారం వారం వర్చువల్ ఇన్‌స్పెక‌్షన్ పేరుతో హడావుడి చేస్తూ.. నెలకు ఒకసారి పోలవరం వచ్చి వెళుతున్నా నిర్వాసితుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. 54 రోజులుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యు.వెంకటేశ్వర్లు, నిర్వాసితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు, డీఎస్పీ ఏటీవీ రవికుమార్ తదితరులు ప్రాజెక్ట్ ప్రాంతంలోనే ఉన్నారు.
Advertisement