పెరిగిన పాఠ్య పుస్తకాల ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లోని 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సేల్ పాఠ్య పుస్తకాల ధరలు పెరిగాయి. పుస్తకాల ముద్రణకు వినియోగించే పేపరు ధరలు పెరగడంతోనే పుస్తకాల ధరలు పెంచాల్సి వచ్చిందని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సేల్ పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, వచ్చే నెల 21 నుంచి పైతరగతుల బోధన ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 15 లోగా మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గతేడాది ముద్రించిన పుస్తకాల్లో 9 లక్షల వరకు మిగిలిపోవడంతో, సోషల్ స్టడీస్ (ఈసారి సోషల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని పాఠాలు, భౌగోళిక స్వరూపాలు మార్పు చేశారు) మినహా మిగతా పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు విద్యా శాఖ అనుమతిచ్చినట్లు తెలిసింది.