
మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతాం..
♦ వెంటనే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించండి..
♦ తడ్కపల్లి గ్రామస్తుల తీర్మానం
సిద్దిపేట రూరల్: ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తమ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపిస్తామని మండలంలోని తడ్కపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. సోమవారం బడిబాటలో భాగంగా గ్రామానికి వెళ్లిన డిప్యూటీ ఈఓ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎంఈఓ ప్రసూనాదేవికి సర్పంచ్ గడ్డం బాల్‌నర్సయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందేశారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తడ్కపల్లి గ్రామం నుంచి 5 నుంచి 10సంవత్సరాలోపు సుమారుగా 150మంది విద్యార్థులకు పైగా ఉన్నారన్నారు. వీరంతా ప్రతి రోజూ సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి వేలల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కోరారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బోధిస్తే గ్రామంలోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, విద్యా కమిటీ చైర్మన్ ఆగంరెడ్డి, గ్రామ నాయకులు శ్రీనివాస్, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.