నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్ట్ చేయాలి
- టీడీపీ హత్యా రాజకీయాలపై ఆగ్రహం
- టీ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ ధర్నా
కళ్యాణదుర్గం : టీడీపీ హత్యా రాజకీయాలపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీ సర్కిల్‌లో ధర్నా చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ తిరుమల వెంకటేశులు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, ప్రచార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాదాఖలందర్, బీసీ సెల్ పట్టణ కన్వీనర్ నాగరాజస్వామి, కాలిక్, ముదిగల్లు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో బలమైన నేతలను అడ్డు తొలగించుకునేందుకు అధికారపార్టీ నాయకులు హత్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నారాయణరెడ్డి హత్య ముమ్మాటికీ ప్రభుత్వమే చేయించిందన్నారు. పత్తికొండలో రోజురోజుకూ వైఎస్సార్‌సీపీకి బలం పెరుగుతుండటంతో ఓర్వలేని టీడీపీ పెద్దలు పథకం ప్రకారం ఈ హత్య చేయించారన్నారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి హత్యలు చేస్తూ ఎంతోకాలం పాలన సాగించలేరని, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.