ఇక ఇంటికే జవాబు పత్రాలు
పరీక్షల విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్నాళ్లు ఏ పరీక్షలు నిర్వహించినా విద్యార్థులకు కనీసం ప్రోగ్రెస్ కార్డులు లేవు.. ఏయే సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలియదు..! 9, 10 తరగతులు మినహా మిగతా తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలను పట్టించుకున్న దాఖ లాలూ లేవు. ఇలా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న నామమాత్రపు పరీక్షల విధానానికి పాఠశాల విద్యాశాఖ చెక్ పెట్టింది. ఎట్టకేలకు అన్ని తరగతుల పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులే కాదు.. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను కూడా పంపించాలని నిర్ణయించింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవోలకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించాలని సూచించారు. అంతేకాదు.. జవాబుపత్రాల మూల్యాంకనం ఎలా చేశారు? మార్కులను ఎలా కేటాయించార న్న అంశాలపై రాష్ట్రస్థాయి అధికారుల బృందాల నేతృత్వంలో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తనిఖీలు ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన సమ్మేటివ్-1(త్రైమాసిక) పరీక్షల మూల్యాంకన విధానంపై అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది.
ఇదీ ప్రణాళిక..
దసరా సెలవులు ముగియగానే 26న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజున విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులతోపాటు సబ్జెక్టుల వారీగా మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను విద్యాశాఖ తల్లిదండ్రులకు పంపించనుంది. వాటిపై ఉపాధ్యాయుల సంతకాలతోపాటు తల్లిదండ్రుల నుంచి సంతకాలు తీసుకోనుంది. 27వ తేదీన విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో స్కూల్లో ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన ప్రత్యామ్నాయ బోధన నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. నవంబర్ మొదటి వారంలో టీచర్లు సమ్మేటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేశారు.. మార్కులు ఎలా వేశారన్న అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారుల బృందాల నేతృత్వంలో తనిఖీలు చేపడతారు. తద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యతను పెంచడంతోపాటు ఇటు టీచర్లు.. అటు తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని విద్యాశాఖ భావిస్తోంది.