కాస్త ఊరట?
ఆర్బీఐ నుంచి రూ.1500 కోట్లు రాక..
ఇందులో విశాఖకు రూ.300 కోట్లు
విశాఖపట్నం : నగదు కష్టాల నుంచి జిల్లా వాసులకు కాస్త ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. రిజర్వు బ్యాంకు నుంచి విశాఖకు మంగళవారం సాయంత్రం రూ.1500 కోట్ల నగదు చేరింది. రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల శాఖలకు నగదును విశాఖలోని స్కేబ్ (స్టేట్ బ్యాంకు చెస్ట్ బ్రాంచి) నుంచే పంపిస్తుంటుంది. రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు అంటే నవంబరు ఏడో తేదీన కొత్త 2 వేల రూపాయల నోట్లను పెద్దసంఖ్యలో విశాఖకు పంపింది. ఆ మర్నాడే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో చేరవేశారు. ఆ తర్వాత స్కేబ్‌కు ఇంత మొత్తంలో నగదు రావడం ఇదే తొలిసారి. ఈ సొమ్మును బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని బ్యాంకు శాఖలకు అందేలా వ్యాన్లు, కంటెయినర్ల ద్వారా పంపనున్నారు. మంగళవారం స్కేబ్‌కు వచ్చిన రూ.1500 కోట్లలో దాదాపు రూ.300 కోట్లను విశాఖకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 18న విశాఖకు రిజర్వు బ్యాంకు రూ.376 కోట్ల నగదును పంపింది. సోమవారం చలామణీ అయ్యాక మంగళవారం నాటికి జిల్లాలో రూ.211 కోట్ల నగదు బ్యాలెన్స్ ఉంది. మంగళవారం వచ్చిన సొమ్ముతో విశాఖ నగరం, జిల్లా అవసరాలకు రూ.500 కోట్ల నగదు ఉంటుందన్నమాట!
క్రిస్మస్‌ను దృష్టిలో ఉంచుకుని..
నాలుగు రోజుల్లో రానున్న క్రిస్మస్ పండగను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ అదనపు నగదును పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో నగదు కొరతతో ఖాతాదార్లకు తగినంత సొమ్ము ఇవ్వడం లేదు. ఏటీఎంల్లో అరకొరగా పెడుతున్న నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. జిల్లా, నగర వ్యాప్తంగా ఉన్న 1112 ఏటీఎంల్లో 25 శాతం ఏటీఎంలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. పనిచేస్తున్న ఏటీఎంల్లో నగదు ఉండడం లేదు. దీంతో జనం పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన సొమ్ముతో బుధవారం నుంచి బ్యాంకులతో పాటు ఏటీఎంల్లోనూ కొంతమేర పాట్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు తాజాగా ఆర్బీఐ నుంచి వచ్చిన నగదులో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అన్నిటికీ మించి రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే జనానికి చాలా వరకు నగదు కష్టాలు, చిల్లర కష్టాలు తీరనున్నాయి.
ఒకట్రెండు రోజుల్లో ఏటీఎంల్లో రూ.500 నోట్లు
ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న రూ.500 నోట్లు నగరానికి వచ్చేశాయి. కొత్త నోటు సైజు చిన్నది కావడంతో ఇప్పటికే చాలా ఏటీఎంల్లో సాంకేతిక మార్పులు చేశారు. జిల్లాలోని సగానికి పైగా మిషన్లలో ఈ మార్పులను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయా ఏటీఎంల్లో కొత్త రూ.500 నోట్లను అందుబాటులో ఉంచే అవకాశం ఉందని బ్యాంకు వర్గాల సమాచారం. ఇప్పటికే మంగళవారం నుంచి బ్యాంకుల ద్వారా ఈ రూ.500 నోట్లను ఖాతాదార్లకు చెల్లింపులు జరుపుతున్నారు. బుధవారం నుంచి ఇవి మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే రెండు వేల రూపాయల కొత్త నోట్ల మార్పిడికి పడుతున్న అగచాట్ల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.