జీడిమెట్ల: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సుమన్ కథనం ప్రకారం... కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన సిద్దిరాములు ఆటో డ్రైవర్. ఇతనికి సంజయ్ (3) ఏకైక కుమారుడు. మంగళవారం రాత్రి 8 గంటలకు సంజయ్‌కు రొట్టె తినిపిస్తుండగా గొంతులో ఇరుక్కుపోయింది.
ఊపిరాడక ఇబ్బందిపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తమ గారాలపట్టి తమ కళ్లెదుటే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి సంజయ్ మృతి కుత్బుల్లాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.