విద్యార్థి దారుణ హత్య
17 రోజుల తరువాత
వెలుగులోకి.. స్నేహితులు హత్య చేసినట్లు అనుమానం
ప్రేమ వ్యవహారమేకారణమా?
బేతంచెర్ల: యం.పేండేకల్లు గ్రామంలో ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన తోటి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముచ్చు పరమేశ్వరయ్య, రామేశ్వరమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు తిరుమలేష్ (19) ఇటీవల ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఈనెల 2వ తేదీన ఇంటి దగ్గర ఉండగా స్నేహితులు వచ్చి బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తెలిసిన బంధువుల ఇళ్లలో తల్లిదండ్రులు గాలించారు. ఆచూకీ కనిపించకపోవడంతో ఈనెల 6 వ తేదీన తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడిని గ్రామానికి చెందిన అతని స్నేహితులు మల్లేష్, కేశలనాయుడు, చిన్నరాజు వెంట తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యచేసి గ్రామ సమీపంలోని వెల్దుర్తి రోడ్డులో ఉన్న బావిలో పూడ్చివేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆదివారం డోన్ డీఎస్పీ బాబా పకృద్ధీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ హనుమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మృత దేహాన్ని వెలికి తీశారు. అక్కడే తహశీల్దార్ అంజనాదేవి సమక్షంలో బనగానపల్లె డాక్టర్ శివశంకర్‌తో పోస్టుమార్టం చేయించారు. తిరుమలేష్ హత్య వార్త తెలుసుకున్న విద్యార్థి బంధువులు, గ్రామస్తులు ఘటన స్థలానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తమ కుమారుడిని అతని స్నేహితులే మట్టుబెట్టారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని గ్రామంలో చర్చించుకుంటున్నారు.