భవనాలు.. పచ్చిక బయళ్లు
♦ రాజ్‌పథ్‌లా రాజధాని పరిపాలన భవనాల డిజైన్
♦ అమరావతి ఐకానిక్ నిర్మాణాల్లో అసెంబ్లీకే ప్రథమ ప్రాధాన్యం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి పరిపాలనా భవన సముదాయాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్ నమూనాలో నిర్మించేందుకు జపాన్‌కు చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్ డిజైన్ రూపొందించింది. రాజ్‌పథ్‌లో రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద లాన్లు, చెట్లు విస్తరించి ఉంటాయి. అదే తరహాలో ఇక్కడ కొంచెం మార్చి రెండు వైపులా భవనాలు నిర్మించి మధ్యలో పొడవునా లాన్లు, పార్కులు, స్థూపాలు నెలకొల్పుతున్నారు. ఏ భవనం నుంచి బయటకు వచ్చినా అక్కడ విశాలైన పార్కులు, కాలువలు, టవర్లుండేలా చూడడం ద్వారా సందర్శకులను ఆకట్టుకునే ఏర్పాట్లు చేయనున్నారు.
తుళ్లూరు వైపున పాలవాగు వద్ద ప్రవేశ మార్గం ఏర్పాటు చేసి మధ్యలో పలు కాలువలు, చెరువులతో ఆహ్లాదవాతావరణాన్ని కల్పించి చివరికి కృష్ణానదీ తీరం వరకూ దాన్ని విస్తరించారు. భవన సముదాయంలో నిర్మాణ నిబంధనలన్నీ సెంట్రల్ ఢిల్లీలో అమలయ్యే అర్బన్ డిజైన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 900 ఎకరాల్లో 30 శాతం విస్తీర్ణాన్ని పూర్తిగా పచ్చదనానికి కేటాయించనున్నారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ప్రత్యేక రూమ్
భవన సముదాయంలో ఐకానిక్ నిర్మాణాలుగా అసెంబ్లీ (లెజిస్లేచర్), హైకోర్టు భవనాలను ఎంపిక చేసినా ఆ రెండింటిలోనూ లెజిస్లేచర్ భవనానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజధానిలో అద్భుత కట్టడంగా దీన్ని మలిచేందుకు అనువుగా డిజైన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందే పోటీలో పాల్గొన్న ఆర్కిటెక్ట్‌లకు సూచించింది. ఎంపికైన మకి అసోసియేట్స్ ప్రతిపాదించిన డిజైన్‌లో ఈ భవనాలే ఆకర్షణలుగా ఉన్నాయి. వీలైతే వీటిని పాలరాతితో తాజ్‌మహల్ తరహాలో నిర్మించే యోచన ఉన్నట్లు సమాచారం. భవనాల పైకప్పులన్నీ సోలార్ ప్యానల్స్‌తో నిండి ఉండేలా డిజైన్ ఉండడంతో పాలరాతిని ఎలా బయటకు చూపించాలనే దానిపై ఆర్కిటెక్ట్‌లు అధ్యయనం చేస్తున్నారు. ఎంపికైన డిజైన్ ప్రకారం లెజిస్లేచర్ భవనాలు నాలుగు బ్లాకుల్లో ఉంటాయి.
ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలున్నా భవిష్యత్తులో 225.. అంతకంటె సంఖ్య పెరిగినా సరిపోయేలా అసెంబ్లీ హాల్‌ను పెద్దగా ఏర్పాటుచేస్తారు. అసెంబ్లీలో సీఎం వెయిటింగ్ హాల్, ముఖ్యమంత్రి సూటు ప్రత్యేకంగా ఉంటాయి.అక్కడినుంచి అసెంబ్లీలో జరిగే చర్చను చూసే ఏర్పాటు ఉంటుంది.మరో బ్లాకులో శాసనమండలి సభ్యుల కోసం కౌన్సిల్ హాలు దాని కంటే చిన్నగా ఉంటుంది. ఇక్కడా సీఎం సూటు, వెయిటింగ్ హాలు ఉంటాయి. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు రెండింటినీ పెద్ద, చిన్న జంట భవనాలుగా ప్రతిపాదించారు. ఈ భవనాల్లోకి నేరుగా సూర్యకాంతి పడేలా డిజైన్ చేశారు.
స్పీకర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. : అసెంబ్లీలో స్పీకర్, కౌన్సిల్‌లో చైర్మన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిపాదించారు. మూడో బ్లాకులో అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు సంయుక్తంగా నిర్వహించే సమావేశాల కోసం పెద్ద సెంట్రల్ హాలుతో భవనాన్ని నిర్మించనున్నారు. నాలుగో బ్లాకులో లెజిస్లేచర్‌కు చెందిన లైబ్రరీని నెలకొల్పుతారు. అసెంబ్లీకి ప్రత్యేకంగా పరిపాలనా భవనం, కౌన్సిల్‌కు పరిపాలనా భవనాలు వాటి పక్కనే నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడంతో దాన్ని తగ్గించేం దుకు వీలైనంత గ్రీనరీ, కాలువలను చుట్టూ ఏర్పాటుచేస్తున్నారు. లెజిస్లేచర్ భవనాల్లో 654 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది.లెజిస్లేచర్ భవనాల్లోకి వచ్చేందుకు సీంకు ప్రత్యేక మార్గం ఉంటుంది. అసెంబ్లీ నుంచి కౌన్సిల్, సచివాలయానికి వెళ్లేందుకు దగ్గరి మార్గాలుంటాయి. మంత్రులు, పాలనా సిబ్బంది, మీడియా-సందర్శకుల కోసం విడివిడిగా ప్రవేశమార్గాలు ఉంటాయి.