ఇక చలి పంజా..!
సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్లుగా చలికి దూరంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక శీతాకాలాన్ని చవి చూడనున్నారు. వాస్తవానికి నవంబర్ మూడో వారం నుంచే చలి మొదలవుతుంది. కానీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో ఈ ఏడాది చలి కాస్త ఆలస్యమైంది. అల్పపీడనాలు, ద్రోణుల వల్ల ఆకాశంలో మేఘాలేర్పడతాయి. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టక చలి తీవ్రత కనిపించదు. కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనద్రోణి కూడా బలహీనపడుతోంది. మరోవైపు అధిక పీడనం ప్రభావంతో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాల వైపు చల్లటి వాయవ్య గాలులు వీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. ‘ఆకాశంలో మేఘాల్లేకపోతే పగటి పూట భూమి త్వరగా వేడెక్కుతుంది. మబ్బులుంటే వేడి పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది. ప్రస్తుతం ఆకాశంలో మేఘాలు లేక సత్వరమే భూమి వేడెక్కి, రాత్రి అయ్యే సరికి వేగంగా చల్లబడిపోతుంది. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ చలి తీవ్రత పెరగడానికి కారణమవుతోంది’ అని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, ఉత్తరకోస్తాలపై చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని ఆయన వివరించారు. గురువారం అత్యల్పంగా ఏపీలోని లంబసింగిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే రెండు డిగ్రీలు పడిపోయింది. మరోవైపు గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.